బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా
- IndiaGlitz, [Friday,March 20 2020]
బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరగనుంది. అయితే.. బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా చేసేశారు. ఆయన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను తీసుకొని ఆయన నేరుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అంతకుముందు కమల్‌నాథ్ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు.
సంచలన వ్యాఖ్యలు
‘బీజేపీ నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నింది. రాష్ట్రాభివృద్ధి కోసం పాటు పడ్డాను. ఈ 15 నెలల్లో నేను చేసిన తప్పేంటి?. ఐదేళ్లు పాలించాలని నాకు ప్రజలు అధికారమిచ్చారు. అత్యాశపరులైన మా ఎమ్మెల్యేలతో బీజేపీ చేతులు కలిపింది. 15 ఏళ్లలో బీజేపీ చేయలేనిది నేను 15 నెలల్లో చేశాను. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. బెంగళూరులో ఎమ్మెల్యేలను నిర్బంధించడం వెనుక ఉన్న అసలు నిజమేంటో దేశ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు. అప్పుడే నిజానిజాలు బయటికి వస్తుంది. ప్రజలు వాళ్లను క్షమించరు’ అని కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దెబ్బ కొట్టిన సింథియా..!
జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు ఊహించిన దెబ్బ కొట్టారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. కమలనాథులు ఆయన్ను రాజ్యసభకు పంపడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయనకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. మొత్తానికి చూస్తే.. గత నెలరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలకు హైడ్రామాకి ఎట్టకేలకు తెరపడిందని చెప్పుకోవచ్చు.