తెలుగు భాష గొప్పతనాన్ని తమిళులకి చెప్పిన కమల్
- IndiaGlitz, [Monday,November 16 2020]
లోకనాయకుడు కమల్‌హాసన్.. ఇండియన్ సినిమాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇటు దక్షిణాది, అటు ఉత్తరాది ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈ స్టార్ హీరో ఇప్పుడు పొలిటికల్ పార్టీని స్థాపించి ప్రజా సేవ చేయడానికి తన వంతు ప్రయత్నాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలే కాదు.. బిగ్‌బాస్ హోస్ట్‌గా బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆయన ఆకట్టుకుంటున్నారు. తాజాగా దీపావళికి ఆయన హోస్ట్ చేసిన బిగ్‌బాస్ కార్యక్రమంలో ఆయన తమిళ కంటెస్టెంట్స్‌కు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించారు. కమల్ హాసన్ నటించిన ‘ఆకలిరాజ్యం’ సినిమా గురించి మాట్లాడుతూ...
‘‘సాధారణంగా తమిళ ఆకలిరాజ్యం వెర్షన్‌లో భారతీరాజా రాసిన సూక్తులను నా పాత్ర చెబుతుంది. కానీ తెలుగులో దాని స్థానంలో మహాకవి శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానంలోని కొన్ని వాక్యాలను ఉపయోగించుకున్నాం’’ అంటూ ఆ వాక్యాలను తెలుగులో చెప్పడమే కాకుండా దాని అర్ధాన్ని కూడా వారికి తమిళంలో వివరించారు. కమల్ వివరణ విన్న తమిళ కంటెస్టెంట్స్ ‘మాకు భాష అర్థం కాలేదు కానీ.. వింటున్నప్పుడు రొమాలు నిక్కబొడుచుకున్నాయి.. సార్’ అన్నారు. ‘‘భారతీయార్ సుందర తెలుగు అని తెలుగు భాషను పొగిడిన దానికి అర్థాన్ని శ్రీ శ్రీ కవితతో చక్కగా వివరించారు’’ అంటూ కమల్ తెలుగు భాష గొప్పతనాన్ని స్టేజ్‌పై వివరించారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.