హిజాబ్ వివాదం.. తమిళనాడుకు పాకనివ్వకండి : కమల్‌హాసన్ సంచలన ట్వీట్
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటకను హిజాబ్ వ్యవహారం కుదుపేస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటుండటం, పరిస్ధితులు అదుపు తప్పుతుండటంతో సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదని... ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ కోరారు.
అసలేం జరిగిందంటే:
నెల క్రితం ఉడుపిలోని ఓ పీయూ కళాశాలలో ఈ వివాదం పుట్టింది. హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం తరగతి గదులకు అనుమతించలేదు. దీంతో వారు నాటి నుంచి కాలేజీకి వచ్చినా సాయంత్రం వరకు అక్కడే ఉండి వెళ్లిపోతుండేవారు. హిజాబ్ తీస్తేనే అనుమతిస్తామని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పడంతో .. ఆ ఆరుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే ఇది వివాదానికి దారి తీసింది.
ఈ ఘటన తర్వాత బైందూరులో హిజాబ్ ధరించి కళాశాలకు వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ అడ్డుకోవడంతో పాటు గేట్ వేసేశారు. ఇక హిందూ సంఘాలు కూడా బరిలోకి దిగడంతో వివాదం తీవ్ర రూపు దాల్చింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయ కండువాలు, తలపాగాలు ధరించి రావడం ప్రారంభించారు. సోమవారం వరకు కేవలం నిరసనలకే పరిమితమైన ఈ వ్యవహారం.. మంగళవారం హింసాత్మక రూపుదాల్చింది.
కొడగు జిల్లాలోని ఓ కళాశాలలో తన స్నేహితురాలికి బలవంతంగా కాషాయం శాలువా వేసేందుకు ప్రయత్నించిన విద్యార్థిపై ప్రత్యర్ధి వర్గం కత్తులతో దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout