నాకు కరోనా సోకలేదు.. ఆందోళన వద్దు : కమల్

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఇండియన్స్ భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు.. వాటికి ఆనుకుని ఉన్న స్టేట్స్‌లో పరిస్థితి అల్లకల్లోల్లంగా ఉంది. వాస్తవానికి లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు అందరూ ఇళ్లకే పరిమితం కాగా.. కరోనా లక్షణాలున్నవారు హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.

నాకేం కాలేదు.. ఆందోళన వద్దు

ఈ క్రమంలో ద‌క్షిణాది సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్‌కు కరోనా వైర‌స్ సోకిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. క‌మ‌ల్‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌న్నదే ఆ పుకార్ల సారాంశం. అంతేకాదు.. తన ఇంటికి రావొద్దని ఇంటి బ‌య‌ట కూడా నోటీసు ఉంద‌ని.. డాక్టర్స్ సూచన మేరకు ఆయన క్వారంటైన్‌లో ఉన్నాడని వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు కమల్ ఓ ప్రకటన రూపంలో క్లారిటీ ఇచ్చుకున్నారు. ‘నాకు కరోనా సోకలేదు.. ఆ లక్షణాలు కూడా నాకులేవు అవ‌న్నీ రూమ‌ర్స్ అంతే. ప్రజ‌లు సామాజిక దూరం పాటించాలి. నా ఇంటి బయట అతికించిన కొన్ని పోస్టర్స్ చూసి అలా అనుకున్నారేమో కానీ కొన్నేళ్లుగా నేను అక్కడ లేనన్న సంగతి అందరికీ తెలుసు. లేనిపోని పుకార్లు సృష్టించి అనవసరంగా అభిమానులను కంగారు పెట్టొద్దు. ఏదైనా వార్త రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని రాయాలి’ అని మీడియాకు ఒకింత కమల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.