చిరు పొలిటికల్ సూచనపై కమల్ స్ట్రాంగ్ రియాక్షన్!
- IndiaGlitz, [Saturday,September 28 2019]
టాలీవుడ్లో నెంబర్ స్టార్‌గా రాణించిన మెగాస్టార్ చిరంజీవి తన మిత్రులైన రజనీకాంత్, కమల్హాసన్లను రాజకీయాల్లోకి రావద్దు అంటూ సూచన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సైరా నరసింహారెడ్డి ప్రమోషన్స్‌లో భాగంగా కోలీవుడ్‌కి చెందిన ఆనంద వికటన్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఫస్ట్ టైమ్ కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు..
కమల్ స్ట్రాంగ్ రియాక్షన్!
‘గెలుపోటముల కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. చిరంజీవి నాకు ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడంతో ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది’ అని కమల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయగా.. రజనీకాంత్ ఇంకా అడుగు వేసి తన పార్టీని ప్రారంభించలేదు. 2021 లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేసి మొత్తం 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పారు.
పోటీ చేసినా పాయే..!
కాగా.. కమల్ హాసన్, ప్రశాంత్ కిషోర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. కానీ 2021 తమిళనాడు ఎన్నికలకు కమల్.. ‘మక్కల్ నీది మయం’ కోసం ఐపీఎసీ వ్యవస్థాపకుడు పనిచేస్తారా..? అనే దానిపై ధృవీకరణ లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేయలేదు కానీ, ఆయన పార్టీ మక్కల్ నీధి మయ్యం పోటీ చేసింది. అయితే, ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు కానీ, ఇంకా పార్టీ పెట్టలేదు. త్వరలోనే ఆయన కూడా తన పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలూ చేస్తున్నారు.
చిరంజీవి ఏం చెప్పారు!?
ఇప్పటికే రాజకీయ రంగ ప్రవేశం చేసిన కమల్ హాసన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధిస్తారని అనుకున్నానని, కానీ అలా జరగలేదని తెలిపారు. రజనీకాంత్, కమల్ నాతరహా వ్యక్తులు కాకపోయినా వారిద్దరినీ రాజకీయాల్లోకి రావద్దనే సలహా ఇస్తాననని చిరు చెప్పుకొచ్చారు. అయితే ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా కూడా ప్రజలకు మంచి చేయాలనుకునేవారు రాజకీయాల్లోకి రావచ్చునని మెగాస్టార్ స్పష్టం చేశారు.