క‌మ‌ల్ హాస‌న్ అనుచిత వ్యాఖ్య‌లు.. నిర‌స‌న‌

  • IndiaGlitz, [Saturday,May 09 2020]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్.. త్యాగ‌రాజ‌స్వామిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. అస‌లు ఇంత‌కూ క‌మ‌ల్‌హాస‌న్ త్యాగ‌రాజ స్వామిని ఉద్దేశిస్తూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేశాడు? ఏం జ‌రిగింది? అనే వివ‌రాల్లోకెళ్తే.. ఇటీవ‌ల క‌మ‌ల్‌హాస‌న్ మ‌రో హీరో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాట్‌లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో మాట్లాడుతూ ‘‘సినిమా టిక్కెట్ల‌ను అమ్మి డ‌బ్బు సంపాదించే వ్యాపారం కాదు.. ఛారిటీ కాదు. తంజావూరు వీధుల్లో రాముడిని కీర్తిస్తూ త్యాగ‌రాజులా బిచ్చ‌మెత్తుకోవడం కాదు’’ అంటూ వ్యాఖ్యానించారు.

కమల్‌హాస‌న్ వ్యాఖ్యల‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం అవుతుంది. త్యాగ‌రాజుస్వామిని దైవంలా కొలిచే ప‌లువురు క‌ర్ణాట‌క సంగీత కారులు క‌మ‌ల్ వ్యాఖ్య‌లపై నిర‌స‌నను తెలియ‌జేస్తున్నారు. క‌మ‌ల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోరుతూ సంగీత క‌ళాకారుడు పాల్ఘాట్ రామ్‌ప్ర‌సాద్ ఆన్‌లైన్‌లో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటీష‌న్‌కు మ‌ద్ద‌తుగా 16 వేల మంది సంత‌కాలు చేశారు. మ‌రిప్పుడు ఈ వ్య‌వ‌హారంపై తాను చేసిన వ్యాఖ‌ల్యు వివాదాస్పదం కావ‌డంపై క‌మ‌ల్‌హాస‌న్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.