Taraka Ratna: తారకరత్న హెల్త్ కండీషన్‌పై స్పందించిన కళ్యాణ్ రామ్.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

  • IndiaGlitz, [Friday,February 10 2023]

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి తారకరత్న ఇంకా కోలుకోలేదు. రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు. కుప్పంలో గుండెపోటుకు గురైన నాటి నుంచి ఆయన బెంగళూరులోని నారాయణ హృదయాలయలోనే చికిత్స పొందుతున్నారు. అక్కడి నిపుణులైన వైద్య బృందం తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. బాలకృష్ణతో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులు, బెంగళూరులోని బంధుమిత్రులు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే వున్నారు. రోజులు గడుస్తున్నా పరిస్ధితిలో మార్పు లేకపోవడంతో మొన్నామధ్య తారకరత్నను విదేశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని భావిస్తున్నారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. కానీ దీనిపై నందమూరి కుటుంబం కానీ, నారాయణ హృదయాలయ గానీ స్పందించలేదు.

తారకరత్నకు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం:

తాజాగా తారకరత్న ఆరోగ్య పరిస్ధితిపై నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. ఆయన హీరోగా నటిచిన ‘అమిగోస్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. తారకరత్నకు బెస్ట్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని.. వైద్యులు ప్రతినిత్యం పర్యవేక్షిస్తున్నారని కళ్యాణ్ రామ్ తెలిపారు. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆకాంక్షించారు. మీ అందరి ఆశీస్సులు ఆయనకు వున్నాయని కళ్యాణ్ రామ్ అన్నారు.

పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న:

కాగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాదర్శి నారా లోకేష్ కుప్పంలో నిన్న యువగళం పాదయాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న కూడా హాజరయ్యారు. అభిమానుల తాకిడి, ఎండ ప్రభావం ఎక్కువగా వుండటంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాసేపు విశ్రాంతి అనంతరం తిరిగి పాదయాత్రకు సిద్ధమవుతూ వుండగా మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో తారకరత్నను హుటాహుటిన కుప్పం ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేయించారు. ఆ వెంటనే పీఈఎస్ వైద్య కళాశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తారకరత్నను శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.