close
Choose your channels

అందుక‌నే హోరా హోరి మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని గ‌ట్టి న‌మ్మ‌కం : క‌ళ్యాణి మాలిక్

Tuesday, September 1, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఐతే, బాస్, అష్టాచ‌మ్మా, అలా..మొద‌లైంది, ఊహ‌లు గుస‌గుస‌లాడే...ఇలా విభిన్నక‌థా చిత్రాల‌కు మ్యూజిక్ అందించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి మాలిక్. తాజాగా నూత‌న న‌టీన‌టుల‌తో తేజ తెర‌కెక్కించిన హోరా హోరి చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈనెల 11న హోరా హోరి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా సంగీత ద‌ర్శ‌కుడు క‌ళ్యాణి మాలిక్ ఇంట‌ర్ వ్యూ..

హోరాహోరి ఆడియోకి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. మీకు వ‌చ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి..?

హోరా హోరి ఆడియోకి ఎంత మంచి స్పంద‌న వ‌చ్చిందో మాట‌ల్లో చెప్ప‌లేను. ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన ఏ సినిమాకి ఇంత మంచి రిపోర్ట్ రాలేదు. ప్ర‌తి ఒక్క‌రు హోరా హోరి పాట‌లు బాగున్నాయి అంటూ ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది. తేజ సినిమాకి సంగీతం అందించాల‌నుకునేవాడిని. అలాంటిది ఫ‌స్ట్ టైం తేజ‌తో చేసిన సినిమా ఆడియోకి ఇంత మంచి స్పంద‌న రావ‌డం నిజంగా చాలా ఆనందంగా ఉంది.

ఈ సినిమాలో మీకు న‌చ్చిన పాట‌లు..?

నాకు ముఖ్యంగా మూడు పాట‌లు చాలా చాలా బాగా న‌చ్చాయి. నీ ఆహా..ఆహా, నా గుండె చ‌ప్పుడు..., చ‌చ్చిపోవాల‌నివుంది...ఈ మూడు పాట‌లు నా ఫేవ‌రేట్స్. ఈ మూడు పాట‌లు ప్రేక్ష‌క మ‌దిలో ప‌ది కాలాల పాటు చిర‌స్థాయిగా ఉండిపోతాయ‌ని నా అభిప్రాయం. నాకు క‌లిగిన అభిప్రాయం మీ అంద‌రికీ కూడా క‌లిగివుంటుంద‌ని ఆశిస్తున్నాను.

క‌ళ్యాణి మాలిక్ అంటే మెలోడి సాంగ్స్....అనే ముద్ర ఉంది. కానీ హోరా హోరి సాంగ్స్ వింటుంటే మాస్ సాంగ్స్ కూడా సూప‌ర్ గా చేయ‌గ‌ల‌రు అనిపిస్తుంది....మీరేమంటారు..?

హోరా హోరి సాంగ్స్ బాగున్నాయి అంటే దానికి కార‌ణం తేజ‌నే. ఆయ‌నే నా నుంచి ఇలాంటి మ్యూజిక్ రాబ‌ట్టారు. ఆయ‌న గ‌త చిత్రాల్లో వైవిధ్య‌మైన మెలోడి, మాస్ సాంగ్స్ ఉంటాయి. అందుక‌నే చిత్రం, జ‌యం, నిజం...ఇలా తేజ సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలో కూడా మెలోడి అండ్ మాస్ సాంగ్స్ ఉండ‌డం నా అద్రుష్టం. క‌ళ్యాణి మాలిక్ అంటే మెలోడి అనే ముద్ర ఈ సినిమాతో చెరిగిపోయింది.

తేజ సినిమాకి ఫ‌స్ట్ టైం సంగీతాన్ని అందించారు క‌దా..తేజ‌తో వ‌ర్కింగ్ ఎక్స్ పీరియ‌న్స్..?

తేజ‌తో 1986 నుంచి ప‌రిచ‌యం ఉంది. ఆయ‌న వ‌స్తున్నాడంటే నేను, రాజ‌మౌళి వెయిట్ చేస్తుండేవాళ్లం. ఆయ‌న ఫ‌స్ట్ కెమెరామెన్ గా, డైరెక్ట‌ర్ గా అయ్యారు. నేను మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయ్యాను. ఆయ‌న సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా పాట‌లు...వాటిని చిత్రీక‌రించే విధానం చాలా బాగుంటుంది. అందుచేత తేజతో ఒక్క సినిమాకి అయినా సంగీతాన్ని అందించాల‌ని అనుకునేవాడిని. చాలా సార్లు మీమిద్ద‌రం క‌ల‌సి ప‌ని చేయాల‌నుకున్నాం కానీ కుద‌ర‌లేదు. ఫైన‌ల్ గా ఇప్పుడు కుదిరింది. ఈ సినిమా విజ‌యం సాధించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా నాక‌న్నా తేజ‌కి హెల్ప అవ్వాలి.

హోరా హోరి ఆడియోప‌రంగా మీ సినిమాల్లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉంటుందంటున్నారు. ఇంత‌కు ముందు ఇలా ఎందుకు కుద‌ర‌లేదు..? ఇప్పుడు ఎలా కుదిరింది..?

బాస్, అష్టాచ‌మ్మా, అధినాయ‌కుడు, గోల్కండ హైస్కూల్...ఇలా ఒక్కొ సినిమాకి ఒక్కోలా సంగీతం అందించాను.గ‌తంలో నేను చేసిన చిత్రాల‌కు ఎక్కువుగా మెలోడి అందిస్తేనే బాగుంటుంద‌నేలాంటి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. ఎక్కువుగా మెలోడి సాంగ్స్ ఉన్న సినిమాలు చేయ‌డం వ‌ల‌న మెలోడి సాంగ్స్ చేస్తాన‌నే ముద్ర ప‌డింది.అలా అనుకోవ‌డంలో కూడా త‌ప్పు ఏమికాదు. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు తేజ మెలోడికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తాడో..మాస్ సాంగ్స కు కూడా అంతే ప్రాధాన్య‌త ఇస్తాడు.అందువ‌ల్ల ఈ సినిమాకి అలా కుదిరింది. మంచి ఆడియో వ‌చ్చింది. నిజంగా తేజ‌తో చేయ‌డం నాకు ద‌క్కిన ఓ వ‌రం.

హోరాహోరి పాట‌లు వినే కొద్ది వినాల‌నిపిస్తున్నాయి. ఈ పాట‌లు వింటుంటే అలా వినాల‌నిపిస్తుంది ఏ ప‌ని చేయాల‌నిపించ‌డం లేదంటూ కొంత మంది ఫేస్ బుక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు..? ఇలాంటివి వింటుంటే మీకు ఏమ‌నిపిస్తుంది..?

అలాంటి మాట‌లు వింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మాట‌ల్లో చెప్ప‌లేను. వాటిని రియ‌ల్ అవార్డ్స్ గా భావిస్తుంటాను. ఆ ఫీలింగ్ చాలా గొప్ప‌గా ఉంటుంది. అదే విధంగా నాకంటు అభిమానులు ఉన్నార‌ని నాలో కొత్త ఉత్సాహాన్ని క‌లిగిస్తుంటాయి.

మీరు ఫ‌స్ట్ టైం ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రానికి అవార్డు అందుకున్నారు క‌దా..? ఇప్ప‌టి వ‌ర‌కు అవార్డ్స్ రాక‌పోవ‌డానికి కార‌ణం ఏమిటి..? ఫ‌స్ట్ టైం అవార్డు వ‌చ్చిన‌ప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి..?

నాకు అవార్డ్స్ రాలేద‌ని బాధ‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. రాష్ర‌ప్ర‌భుత్వం ఇచ్చే నంది అవార్డు, అలాగే ఫిలింఫేర్ అవార్డ్ కాక‌పోయినా..కొన్ని సంస్థ‌లు ఇచ్చే అవార్డు కూడా రాలేద‌ని చాలా బాధ‌ప‌డ్డాను. అయితే ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రానికి అవార్డు రావ‌డంతో ఇన్నాళ్ల నుంచి అవార్డ్స్ రాలేద‌ని నాలో ఉన్న బాధ‌పోయింది. అదీ కూడా మ‌హేష్ బాబు చేతుల మీదుగా అవార్డు అందుకోవ‌డం మ‌రింత సంతోషాన్ని క‌లిగించింది. ఆ...క్ష‌ణాల‌ను జీవితంలో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను.

అలా..మొద‌లైంది, ఊహ‌లు గుస‌గుస‌లాడే...ఇలా స‌క్సెస్ ఫుల్ సినిమాల‌కు సంగీతాన్ని అందించినా..సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువుగా ఉంటుంది. కావాల‌ని తీసుకుంటున్న గ్యాప్పా...?

అంద‌రు నేను కావాల‌ని గ్యాప్ తీసుకుంటున్నాన‌ని అనుకుంటారు. అలాంటి ఏమి లేదు. నేను చేసిన సినిమాలు స‌క్సెస్ అయినా ఏమిటో కాని నాకు అవ‌కాశాలు రావు..అదేమిటో మ‌రి. అష్టాచమ్మా త‌రువాత ఓ సంవ‌త్స‌రం ఖాళి. ఆత‌ర్వాత అలా...మొద‌లైంది సినిమాకి సంగీతం అందించాను. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. త‌ర్వాత మ‌ళ్లీ సంవ‌త్స‌రం ఖాళిగా ఉన్నాను. ఇక నుంచైనా గ్యాప్ రాకుండా వ‌రుస‌గా సినిమాలు చేసే అవ‌కాశం రావాల‌ని ఆ దేవుడ్ని కోర‌కుంటున్నాను.

మీరు ఎక్కువుగా నిర్మాత దామోద‌ర ప్ర‌సాద్ సినిమాలు చేస్తున్నారు. ఆయ‌న‌తో మీకున్న అనుబంధం..?

దామోద‌ర ప్ర‌సాద్గారితో ఎప్ప‌టి నుంచో ప‌రియం. ఈ సినిమా దామోద‌ర‌గారి సంస్థ‌లో నాకు మూడో సినిమా. ఆయ‌న అంద‌రికీ న‌చ్చేలా మంచి సినిమాలు అందించాల‌నుకుంటారు. అలాంటి అభిరుచి గ‌ల నిర్మాత అందించే సినిమాల‌కు సంగీతం అందించ‌డం సంతోషంగా ఉంది.

హోరా హోరి సినిమా మీరు చూసి ఉంటారు..ఎలా ఉంది..?

సినిమా చూసాను 70 శాతం చాలా కొత్త‌గా ఉంటుంది. 30 శాతం పాత తేజ క‌నిపిస్తాడు.ఫోటోగ్ర‌ఫీ అద్భుతంగా ఉంటుంది. నా పాట‌ల‌న్నీ చాలా బాగా పిక్చ‌రైజ్ చేసాడు. ధ‌నవంతుడు, పేద‌వాడు మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌క‌ధ కాదిది. దాని నుంచి బ‌య‌ట ప‌డిపోయాడు.ఇది ఒక ల‌వ్ థ్రిల్ల‌ర్...చాలా కొత్త‌గా ఉంటుంది. అందుక‌నే ఖ‌చ్చితంగా హోరా హోరి మంచి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని నాకు గ‌ట్టి న‌మ్మ‌కం.

మ్యూజిక్ ప‌రంగా ఈ సినిమాలో మీకు బాగా న‌చ్చిన సీన్..?

రీ రికార్డింగ్ లో ఇంట‌ర్వెల్ లో 12 నిమిషాల ఛేజ్ సీన్ ఒక‌టి ఉంది. అందులో ఒక్క డైలాగ్ కూడా ఉండ‌దు. దానికి రీ రికార్డింగ్ చాలా బాగా చేసావ్ అంటు తేజ న‌న్ను అభినందించారు. దామోద‌ర‌ప్ర‌సాద్ గారు కూడా చాలా బాగుంది రీ రికార్డింగ్ కి అవార్డు ఏదైనా ఉంటే నీకు ఇవ్వాలంటూ అభినందించారు. ఈ ఛేజ్ సీన్ నాకు చాలా బాగా న‌చ్చింది.

మీకు స్పూర్తి ఎవ‌రు..?

నేను జీవితాంతం గుర్తుంచుకునే మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అండ్ ఇన్సిప్పిరేష‌న్ అంటే ఇళ‌య‌రాజా, ఆర్.డి.బ‌ర్మ‌న్.

మీపై కీర‌వాణి గారి ప్ర‌భావం ఎంత‌..?

అన్న‌య్య పాట‌లు చాలా ఇష్టం. కానీ ప్ర‌భావం చాలా త‌క్కువ‌. నాపై హిందీ పాట‌ల ప్ర‌భావం ఎక్కువ‌.

బాహుబ‌లి చిత్రంలో మీరు కూడా ఓ పార్ట్ అయ్యారు..ఎలా ఫీల‌య్యారు..?

బొంబాయిలో అనుకున్న‌ట్టు రావ‌డం లేదు. నువ్వు రావాలని రాజ‌మౌళి అంటూ సౌండ్ మిక్సింగ్ బాధ్య‌త నాకు అప్ప‌చెప్పాడు. అదోక గొప్ప అనుభూతి. మొత్తం 30 రోజులు డే అండు నైట్ వ‌ర్క్ చేసాను. నేను క‌నుక లేక‌పోయింటే జులై 10 బాహుబ‌లి రిలీజ్ అయ్యుండేది కాద‌న్నాడు. రెండున్నారేళ్ల ప‌డ్డా క‌ష్టం మ‌ర‌చిపోయేలా చేసేవ్ అంటూ న‌న్ను అభినందించ‌డం చాలా సంతోషం క‌లిగించింది.

కీర‌వాణిగారు రిటైర్మెంట్ తీసుకుంటానంటున్నారు కాదా..? అదే జ‌రిగితే రాజ‌మౌళి సినిమాల‌కు మీరే మ్యూజిక్ డైరెక్ట‌ర్ అంటున్నారు మీరేమంటారు..?

రాజ‌మౌళి సినిమాల‌కు అన్న‌య్య కీర‌వాణే సంగీతం అందించాల‌ని అనుకుంటున్నాను.అన్న‌య్య సంగీతం అందించ‌డం కుద‌ర‌దు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అంటే క‌నుక రాజ‌మౌళి సినిమాల‌కు రెహ‌మాన్ సంగీతం అందిస్తేనే బాగుంటుంద‌నేది నా అభిప్రాయం.ఇక నా విష‌యానికి వ‌స్తే... అన్న‌య్య‌కున్నంత ఓపిక‌, ప్ర‌తిభ‌ నాకు లేవు.

మీ త‌దుప‌రి చిత్రాల గురించి..?

నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నాను. అలాగే అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందే సినిమాకి కూడా సంగీతం అందిస్తున్నాను. ఈ సినిమా అక్టోబ‌ర్ లో ప్రారంభం అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment