క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభ‌మైంది. కె.వి.గుహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేశ్ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహుర్త‌పు స‌న్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ కొట్ట‌గా నంద‌మూరి హ‌రికృష్ణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నంద‌మూరి రామ‌కృష్ణ తొలి స‌న్నివేశానికి గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో...

కె.వి.గుహ‌న్ మాట్లాడుతూ - ''క‌ల్యాణ్ హీరోగా మ‌హేశ్ కోనేరుగారి నిర్మాణంలో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. ఇదొక స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. స్క్రిప్ట్ చాలా బాగా వ‌చ్చింది'' అన్నారు. 

నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ - ''క‌ల్యాణ్ రామ్‌గారితో మా బ్యాన‌ర్‌లో 'నా నువ్వే' సినిమా చేశాం. అది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఆ సినిమా విడుద‌ల‌య్యే లోపు క‌ల్యాణ్‌రామ్‌గారితోనే రెండో సినిమాను నిర్మించ‌నుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. గుహ‌న్‌గారు చెప్పిన స్క్రిప్ట్ మాకు న‌చ్చింది. అలాగే క‌ల్యాణ్‌రామ్‌గారికి కూడా న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి ఆయ‌న ఒప్పుకున్నారు. మే 2 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాల‌కు శేఖ‌ర్ చంద్ర‌గారు చాలా మంచి సంగీతాన్ని అందిస్తార‌నే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మా సినిమాకు సంగీతం అందించ‌నుండ‌టం హ్యాపీగా ఉంది'' అన్నారు.

షాలిని పాండే మాట్లాడుతూ ''తెలుగులో నా రెండో సినిమా. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. సినిమాలో భాగం కావ‌డం ఆనందంగా ఉంది'' అన్నారు.

నివేదా థామ‌స్ మాట్లాడుతూ - ''గుహ‌న్ గారు స్క్రిప్ట్‌ను త‌మిళంలో వినిపించారు. తెలుగు సినిమాలకు ఆరు నెల‌లు దూరంగా ఉన్నాను. నిర్మాత మ‌హేశ్‌గారితో చాలా కాలంగా అనుబంధం ఉంది. ఆయ‌నతో క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది'' అన్నారు.

శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - ''స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్... మ్యూజిక్‌కి మంచి స్కోప్ ఉన్న సినిమా'' అన్నారు.