పీరియడ్ డ్రామా స్పై థ్రిల్లర్ లో కల్యాణ్ రామ్

  • IndiaGlitz, [Sunday,February 14 2021]

నంద‌మూరి హీరో క‌ల్యాణ్ రామ్ హీరోగా గ‌త ఏడాది ఎంత మంచివాడ‌వురా సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమా ఆశించిన విజ‌యాన్ని ద‌క్కించుకోలేదు. ఆ త‌ర్వాత కోవిడ్ ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో క‌ల్యాణ్ రామ్ త‌దుప‌రి సినిమా ఏదీ విడుద‌ల కాలేదు. ఈ నేప‌థ్యంలో కల్యాణ్ రామ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమాకు నిర్మాత‌గా మారాడు. మ‌రోవైపు హీరోగా, నిర్మాత‌గా మ‌ల్లిడి వేణు ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమాను పూర్తి చేసే క్ర‌మంలో ఉన్నాడు. ఈ స‌మ‌యంలో క‌ల్యాణ్‌రామ్‌కు కొత్త సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది.

వివ‌రాల్లోకి వెళితే.. బాబుబాగా బిజీ ఫేమ్ న‌వీన్ మేడారం త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పై థ్రిల్ల‌ర్‌ను రూపొందించ‌డానికి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నాడు. ఏజెంట్ వినోద్ పేరుతో తెర‌కెక్క‌బోతున్న ఈ చిత్రం 1940 బ్యాక్‌డ్రాప్‌లో రూపొంద‌నుంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనులు చ‌క‌చ‌కా జ‌రుగుతున్నాయి. ఎక్స్ పెరిమెంట్ మూవీస్ చేయడానికి ఆసక్తి చూపించే కల్యాణ్ రామ్.. డైరెక్టర్ నవీన్ మేడారం తనను క‌లిసి లైన్ చెప్ప‌గానే ఇప్ప‌టి వ‌ర‌కు న‌టించని పీరియాడిక్ మూవీ కావ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాడట. త్వరలోనే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.