Uttam: కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్య్ర భారతంలోనే అతి పెద్ద కుంభకోణం: ఉత్తమ్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు స్వతంత్ర్య భారతదేశంలోనే అతి పెద్ద కుంభకోణం అని ఆరోపించారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీ ఎంతో ముఖ్యమైనది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకు నీరిచ్చే ఆలోచన చేసింది. దురదృష్టవశాత్తూ మేడిగడ్డ కుంగిపోయింది. డిజైన్, నిర్మాణ లోపాలు, ఓఅండ్‌ఎం పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయింది. వందేళ్లు ఉండాల్సిన బ్యారేజీని.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారు" అని మండిపడ్డారు .
"గత ప్రభుత్వం నిర్వాకం, అవినీతి కారణంగా మేడిగడ్డి ఈ స్థితిలో ఉంది. రూ.1800 కోట్లతో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత అంచనా వ్యయం పెంచుతూ రూ.4,500 కోట్లకు తీసుకెళ్లారు. అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థమవుతోంది. స్వతంత్ర భారతదేశంలో ఈ తరహా అవినీతి జరగలేదు. ఇకపై జరగబోయేదీ లేదు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు ఏ ఒక్కరోజు కూడా మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయంపై స్పందించలేదు. ఇలాంటి తప్పులు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్ క్షమాపణ చెప్పాలి" అని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులపై సలహాలు, సూచనలు ఇచ్చే అధికారం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఉందన్నారు. ఒక్క మేడిగడ్డే కాదని అన్నారం బ్యారేజీ కూడా లోపాభూయిష్టంగా ఉందని.. అక్కడ కూడా లీకులు వస్తున్నాయని తెలిపారు. అందుకే ఆ బ్యారేజ్‌లో నీరు నింపొద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ సూచించిందని పేర్కొ్న్నారు. అలాగే ఎలాంటి సర్వే నిర్వహించకుండా మల్లన్న సాగర్ నిర్మించారని ధ్వజమెత్తారు. చిన్నపాటి ప్రకంపనలు వచ్చినా ప్రమాదంలో పడుతుందని.. దీంతో ఆ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని కాగ్ తెలిపిందని ఆయన వెల్లడించారు.
దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని విమర్శించారు. అది శ్వేతపత్రం కాదు.. అబద్ధపు పత్రం అన్నారు. గత ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రం ప్రవేశపెట్టారని విమర్శలు చేశారు. మిడ్ మానేరు ప్రాజెక్టులను తమ హయాంలోనే పూర్తిచేశామని గుర్తు చేశారు. మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో గోబెల్స్ ప్రచారం చేసినట్లే.. సభలోనూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సభను తప్పదోవ పట్టించే యత్నం చేశారంటూ మండిపడ్డారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout