'కళ కళ కళామందిర్ చీరే కట్టి' మాకు ఎప్పటికీ హిస్టరీగా నిలిచిపోతుంది - కళామందిర్ కళ్యాణ్
- IndiaGlitz, [Wednesday,January 31 2018]
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కె. ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లి. అధినేత సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం 'ఇంటిలిజెంట్'. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైనర్ చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఎస్.ఎస్.థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోలోని మూడు పాటలను రిలీజ్ చేశారు.
చివరి నాల్గవ పాట 'కళ కళ కళామందిర్ చీరే కట్టి' పాటను జనవరి 31న హైదరాబాద్ కూకట్పల్లి కళామందిర్ షోరూమ్‌లో లాంచ్ చేశారు. హీరో సాయిధరమ్‌కు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వి.వి.వినాయక్, నిర్మాత సి.కళ్యాణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి.వి.రావు, కళామందిర్ ప్రొప్రయిటర్ కళ్యాణ్ పాల్గొన్నారు. భాస్కరభట్ల రాసిన 'కళ కళ కళామందిర్' పాటను కళామందిర్ కళ్యాణ్ లాంచ్ చేశారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫిబ్రవరి 4న రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఘనంగా జరగనుంది.
సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ''ఇంటిలిజెంట్' చిత్రంలో 'కళ కళ కళామందిర్ చీరే కట్టి' అనే పల్లవి అనుకోకుండా వచ్చింది. కళామందిర్ షోరూమ్ ప్రసాద్, కళ్యాణ్ మా ఇంటి ప్రక్కనే వుంటారు. పాట విని చాలా సంతోష పడ్డారు. అందరం చాలా హ్యాపీగా ఫీలయ్యాం. థమన్ మంచి ట్యూన్ కంపోజ్ చేశాడు. భాస్కరభట్ల ఫెంటాస్టిక్‌గా రాశాడు. చాలా క్యాచీగా వుంది. ఖచ్చితంగా సూపర్‌హిట్ అవుతుంది. ఇంత మంచి పాటని ఈ కళామందిర్లో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.
కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ - ''కళ కళ కళామందిర్ చీరేకట్టి' వంటి అద్భుతమైన పాటకి మ్యూజిక్ ఇచ్చిన థమన్‌కి, రాసిన భాస్కరభట్లకి నా థాంక్స్. ఈ పాటని మా కళామందిర్లో లాంచ్ చేసే అవకాశం కల్పించిన వినాయక్, సాయిధరమ్ తేజ్, సి.కళ్యాణ్, సి.వి.రావుగారికి నా కృతజ్ఞతలు. ఈ పాట మాకు హిస్టరీగా నిలిచిపోతుంది. 'ఇంటిలిజెంట్' టీమ్ మాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్‌గా భావిస్తున్నాం. మాకు 30 బ్రాంచ్‌లు వున్నాయి. మూడు వేల మంది వర్కర్స్ వున్నారు. అందరి కాలర్ రింగ్ టోన్గా ఈ పాట వుంటుంది. పాటని పెద్ద హిట్ చేస్తాం'' అన్నారు.
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ - ''సినిమాలోని నాలుగో పాట 'కళ కళ కళామందిర్' పాటని కళామందిర్లో రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా వుంది. కళామందిర్‌కి ఎంతమంది అయితే కస్టమర్స్ వస్తారో వారంతా థియేటర్‌కి వచ్చి మా సినిమా చూడండి. ఈ చిత్రంలో ఒన్ ఆఫ్ ది మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్. థమన్ ఎక్స్‌లెంట్‌గా ట్యూన్ కంపోజ్ చేశాడు. భాస్కరభట్ల క్యాచీగా లిరిక్స్ రాశాడు. శేఖర్ మాస్టర్ బ్యూటిఫుల్‌గా కొరియోగ్రఫీ చేశారు. అందరూ ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం వుంటుంది'' అన్నారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ - ''కళామందిర్ షాపు ఓపెనింగ్ బిగినింగ్ దగ్గర నుండి సినిమా వాళ్లతో ప్రసాద్, కళ్యాణ్ క్లోజ్‌గా అసోసియేట్ అవుతూ సినిమా ప్రమోషన్స్‌కి చాలా ఉపయోగపడుతున్నారు. మా చిత్రంలో 'కళ కళ కళామందిర్' పాట అనుకోకుండా వచ్చినా అదిరిపోయింది. 'చమక్ చమక్', 'లెట్స్ డు', 'నా సెల్‌ఫోన్' పాటలు చాలా డిఫరెంట్‌గా వుంటాయి. ఈ కళ కళ కళామందిర్ సాంగ్ లాస్ట్‌లో వస్తుంది. యూత్ అంతా డ్యాన్స్‌లు చేసేవిధంగా మంచి ఫాస్ట్‌బీట్‌తో ఈ పాట వుంటుంది. ఎంతో ఖర్చుపెట్టి చాలా గ్రాండియర్‌గా ఈ పాటని చిత్రీకరించాం. కళామందిర్ షాపులో చీరలు ఎంత క్వాలిటీగా, రిచ్‌గా వుంటాయో ఈ పాట కూడా అంతే క్వాలిటీతో వుంటుంది. ఈ పాటతో కళామందిర్ షాపుకి ఎంతో పబ్లిసిటీ వస్తుంది. అలాగే మా సినిమాని కూడా బాగా ప్రమోట్ చెయ్యమని కోరుతున్నాం. వినాయక్ 'ఖైది నంబర్ 150' సినిమా తర్వాత మా తేజుతో ఈ సినిమా చెయ్యటం మా అదృష్టం. ఇదే కాంబినేషన్లో మళ్ళీ సూపర్‌హిట్ మూవీ సినిమాలు చెయ్యబోతున్నాం'' అన్నారు.
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో నా మోస్ట్ ఫేవరేట్ సాంగ్ 'కళ కళ కళామందిర్'. నాకు చీరలు అంటే చాలా ఇష్టం. కళామందిర్ షోరూమ్ వెరీ ఫేమస్. ఈ పాటని కళామందిర్లో లాంచ్ చేయడం చాలా హ్యాపీగా వుంది'' అన్నారు.