Dwarampudi Chandrasekhar Reddy:నేనేంటో అల్లు అరవింద్‌ని అడుగు .. నీ చిట్టా నా దగ్గరుంది, జాగ్రత్త : పవన్‌కు ద్వారంపూడి వార్నింగ్
- IndiaGlitz, [Tuesday,June 20 2023]
తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ సీనియర్ నేత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పవన్ కళ్యాణ్ నిజంగా రాజకీయ నాయకుడైతే.. తొలుత ఎమ్మెల్యేగా గెలవాలని సవాల్ విసిరారు. పార్టీని, పార్టీ కార్యకర్తలను చంద్రబాబుకు తాకట్టు పెట్టడం మానుకోవాలని ద్వారంపూడి చురకలంటించారు. పవన్ పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు చెయ్యడానికి ఇది సినిమా కాదని ఆయన హెచ్చరించారు. ముందు ఒక్కసారైనా గెలిచి, ఆ తరువాత నీతులు మాట్లాడాలని ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నేనే రౌడీనైతే నీ బ్యానర్లు కాకినాడలో వుంటాయా :
తానెప్పుడు తుపాకీ పట్టుకుని రోడ్లపైన తిరగలేదని.. రౌడీనే అయితే కాకినాడలో పవన్ ఫొటోలతో ఉన్న జనసేన బ్యానర్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. తాను రౌడీనే అయ్యంటే ఒక్క జనసేన బ్యానర్ కూడా లేకుండా చెయ్యగలననన్నారు. తాను రౌడీనే అయితే ప్రజలు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎలా ఎన్నుకుంటారని ద్వారంపూడి ప్రశ్నించారు. తన పైన ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలతో, కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నానని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ భవిషత్తు గురించి ఆలోచించుకోవాల్సింది ఒక్కసారి కూడా గెలవని పవన్ కళ్యాణ్ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నేనూ బూతులు మాట్లాడగలను .. కానీ :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వయసైపోయింది కాబట్టే పవన్ కళ్యాణ్ ఆయన తరుపున యాత్ర చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అసలు పవన్ పార్టీ పెట్టింది కూడా చంద్రబాబుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడడానికేనని ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వీళ్ళిద్దరూ గెలిచే అవకాశం లేదని.. దమ్ముంటే కాకినాడలో తనతో పోటీ చేసి గెలవాలని చంద్రశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. ఈసారి కూడా పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ద్వారంపూడి జ్యోస్యం చెప్పారు. తాను తలుచుకుంటే భూతులు మాట్లాడొచ్చని.. పవన్ కంటే పెద్ద నాలుక ఉన్నా రాజకీయ నాయకుడిగా బాధ్యతగా ప్రవర్తిస్తున్నానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాకినాడ పోర్టులో తక్కువ ఛార్జీలు ఉండటం వల్లే బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయని మాట్లాడటం అవివేకమన్నారు. పోర్టు విషయాలు ఇంకా లోతుగా తెలుసుకుని మాట్లాడాలని ద్వారంపూడి హితవు పలికారు.
అల్లు అరవింద్‌ని అడిగితే తెలుస్తుంది:
తాను కూడా సినీ రంగానికే చెందినవాడినేనని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తాను ఫిల్మ్ ఎగ్జిబిటర్‌నని.. తమ కుటుంబానికి సినిమా హాళ్లు వున్నాయని చిరంజీవి, పవన్ కల్యాణ్‌ల సినిమాలు వాటిలో ఆడించానని ఎమ్మెల్యే వెల్లడించారు. పవన్‌కు ఈ విషయం తెలుసో , లేదో కానీ అల్లు అరవింద్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు చాలా పరిచయాలు వున్నాయని.. పవన్ కల్యాణ్ చిట్టా అంతా తన వద్ద వుందని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు.
దమ్ముంటే కాకినాడలో పోటీ చేసి గెలువు :
పవన్ కాకినాడ నుంచి పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తానని ఆయన సవాల్ విసిరారు. ద్వారంపూడిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్‌కు లేదని.. తనకు, ఆయనకు చాలా తేడా వుందన్నారు. ప్యాకేజీ కుదరకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారని.. అసలు జనసేన పార్టీని ఎవరి కోసం పెట్టారని చంద్రశేఖర్ రెడ్డి నిలదీశారు. తాను సీఎం అయినట్లు పవన్ సినిమా తీసుకుని సంబరపడాల్సిందేనని ఆయన సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్, చంద్రబాబును తరిమి కొట్టాలని ద్వారంపూడి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.