ఒకే ఫ్రేములో రెండు చంద‌మామ‌లు

  • IndiaGlitz, [Wednesday,February 05 2020]

రెండు అంద‌మైన చంద‌మామ‌ల‌ను చూస్తున్నామా అని అభిమానులు అనుకుంటున్నారు. అలాగే అస‌లు త‌మ అభిమాన హీరోయిన్ ఎవ‌రా? అని కూడా ఆలోచించుకుంటున్నారు. ఇంత‌కు అభిమానుల‌ను అంత‌లా క‌న్‌ఫ్యూజ్ చేస్తున్న ముద్దుగుమ్మ ఎవ‌రో కాదు.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌. టాలీవుడ్‌లో 12 ఏళ్ల క్రితం 'ల‌క్ష్మీక‌ళ్యాణం' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని అగ్ర క‌థానాయ‌కులైన చిరంజీవి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, బ‌న్ని, మ‌హేశ్ ఇలా అందరితో ఆడిపాడింది.

50 పైగా సినిమాల‌ను పూర్తి చేసిన అతి కొద్ది మంది నేటి త‌రం హీరోయిన్స్‌లో ఆమె ఒక‌రు. నేటి త‌రం కుర్ర హీరోలైన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వంటి వారితోనూ న‌టిస్తుంది. ఈ అమ్మ‌డు త‌న మైన‌పు విగ్ర‌హాన్ని బుధ‌వారం సింగ‌పూర్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఆవిష్క‌రించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో ప్ర‌భాస్‌, మ‌హేశ్ వంటి వారి మైన‌పు విగ్ర‌హాల‌నే మేడ‌మ్ టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది. ద‌క్షిణాదికి చెందిన హీరోయిన్స్‌లో కాజ‌ల్ మాత్ర‌మే మేడ‌మ్ టుస్సాడ్స్ మైన‌పు విగ్ర‌హాన్ని క‌లిగిన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ సుంద‌రాంగి సీనియ‌ర్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ 'ఇండియ‌న్ 2' చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాలో ఈమె 85 బామ పాత్ర‌లో న‌టించ‌నుంది.