Kadiyam Kavya: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

  • IndiaGlitz, [Tuesday,April 02 2024]

తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మరికొంతమంది కూడా హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ దక్కింది. ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు చర్చల అనంతరం వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా కావ్య పేరును ఖరారుచేశారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.

దీంతో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇక కీలకమైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టనున్నారు. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరగనున్న జనజాతర సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో వెల్లడించనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ తదితర జాతీయ నేతలు హాజరుకానున్నారు. ఈలోపే మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారుచేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయింది. దీంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన పాలనకు పార్లమెంట్‌ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తాయని బహిరంగంగానే చెప్పారు.

ఈ నేపథ్యంలో 12-14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో కంటే దక్షిణాదిలోనే బలం ఉంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. అలాగే కేరళలో యూడీఎఫ్ కూటమితో చాలా బలంగా కనిపిస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ స్థానాలు గెలిచి సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలోనే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. గెలుపు గుర్రాలనే అభ్యర్థులగా నిలబడుతుంది.