బాలీవుడ్‌లో అంచనాలు పెంచేస్తున్న 'కబీర్ సింగ్'

  • IndiaGlitz, [Monday,May 13 2019]

విజయ్ దేవరకొండ, షాలిని పాండే నటీనటులుగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్‌లో హిట్టయ్యిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను పలు భాషల్లో డబ్ చేసేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు అప్పట్లో క్యూ కట్టారు. 2017లో విడుదలైన సినిమా విజయ్‌కు లైఫ్ ఇచ్చి స్టార్‌ను చేసిందని చెప్పుకోవచ్చు. అప్పటికీ ఇప్పటికీ ఈ సినిమా అంటే క్రేజే వేరు. ఈ సినిమా అటు తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

మక్కీకి మక్కీ దింపేశాడుగా!

కాగా.. బాలీవుడ్‌లో షాహిద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ మూవీని ‘కబీర్ సింగ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ను డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ఈ మూవీని హిందీలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే పెద్దగా కొత్తగా ఏమీ లేదు.. జస్ట్ హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు మారారంతే.. అర్జున్‌ రెడ్డిలోని ప్రతీ సీన్‌ను మక్కీ మక్కీ దింపేసినట్టే స్పష్టంగా ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చుగుద్దినట్లు దింపేశాడు డైరెక్టర్. ఈ ట్రైలర్‌లో ఐస్ ముక్కల సీన్, కాలేజీ సీన్, హాస్పిటల్ సీన్స్‌, హీరోయిన్‌ దగ్గర్నుంచి హీరో అలిగివెళ్లిపోవడం ఈ సన్నివేశాలన్నీ హైలైట్‌గా నిలిచాయి. ఈ ట్రైలర్‌గా తెలుగు ప్రేక్షకులకు కొత్తగా ఏమీ అనిపించదు.. కానీ బాలీవుడ్‌లో మాత్రం భారీ అంచనాలు పెంచేసింది. కాగా ఇప్పటికే.. ఈ ట్రైలర్ 1,031,765 మంది చూడగా వేలమంది కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రంలో.. షాహిద్ సరసన కియరా అడ్వాణీ నటిస్తోంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఈ మూవీని జూన్ 21న బాలీవుడ్ ప్రేక్షకులు, సినీ ప్రియుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రం తెలుగులో సూపర్ డూపర్ హిట్టవ్వడమే కాదు.. ఇప్పటికీ ఈ సినిమా అంటే యూత్ పడిచచ్చిపోతున్నారు. మరి ఈ రేంజ్‌లో హిట్టయిన 'అర్జున్‌ రెడ్డి'.. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’ గా ఏ మాత్రం కలెక్షన్లు సంపాదించి పెడతాడో.. ఏ రేంజ్‌లో హిట్‌ను ఖాతాలో వేసుకుంటాడో తెలియాలంటే జూన్-21 వరకు వేచి చూడాల్సిందే మరి.