కబాలి ఓ సునామి..
- IndiaGlitz, [Thursday,July 21 2016]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. యువ దర్శకుడు రంజిత్ తెరకెక్కించిన కబాలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 22న రిలీజ్ అవుతుంది. కబాలి రిలీజ్ కి ముందే కనీవినీ ఎరుగని రీతిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సంచలనాల కబాలి గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం...
100 బడ్జెట్ తో కబాలి..
కబాలి చిత్రాన్ని100 కోట్ల బడ్జెట్ తో కలై ఫులి ఎస్ థాను నిర్మించారు. దాదాపు 200 కోట్లకు పైగా బిజినెస్ అయ్యింది. తొలి మూడు రోజుల్లోనే 200 కోట్లు వసూలు చేస్తుందని సినీ పండితుల అంచనా. కబాలి బాహుబలి రికార్డ్ ను క్రాస్ చేసి 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని నిర్మాత కలై ఫులి ఎస్ థాను తెలియచేసారు. అయితే...కబాలి ఆశించిన స్ధాయిలో విజయం సాధిస్తే ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్లు వసూలు చేయచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు.
కబాలి రన్ టైమ్
కబాలి చిత్రంలో రజనీకాంత్ ఇంట్రడక్షన్ సాంగ్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ సాంగ్ కోసం చిత్రయూనిట్ చాలా శ్రద్ద తీసుకుందట. ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేసి భారీ ఎత్తున చిత్రీకరించారు. ఇందులో నాలుగు సాంగ్స్, నాలుగు ఫైట్స్ ఉన్నాయి. మొత్తం కబాలి రన్ టైమ్ రెండు గంటల ముప్పై నిమిషాల పద్దెనిమిది సెకన్లు.
ప్రపంచ వ్యాప్తంగా 10,000 థియేటర్లో కబాలి..
రజనీకాంత్ సినిమా అంటే...మన దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భారీ స్ధాయిలో రిలీజ్ అవుతుంటుంది. ఈసారి జపాన్ తో పాటు చైనీస్, మలై, థాయ్ లో కూడా కబాలి రిలీజ్ అవుతుంది. జపాన్, చైనీస్, మలై, థాయ్ భాషల్లో అనువాదమైన తొలి తమిళ చిత్రం కబాలి కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10,000 థియేటర్స్ లో కబాలి రిలీజ్ అవుతుంది.
య్యూట్యూబ్ లో సంచలనం
కబాలి చిత్రం టీజర్ య్యూట్యూబ్ లో సంచలన సృష్టించింది. కబాలి తమిళ ట్రైలర్ ను 2.6 కోట్ల మంది య్యూట్యూబ్ లో చూసారు. ఇండియన్ సినిమాలో ఇదొక సంచలనం అని కబాలి చిత్ర యూనిట్ తెలియచేసింది. తెలుగు ట్రైలర్ ను దాదాపు 50 లక్షల మంది చూసారు. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన కబాలి మేకింగ్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.
ప్రమోషన్స్ లో కొత్త రికార్డ్..
కబాలి చిత్రం దేనిని వదల్లేదు. రిలీజ్ కి ముందు రికార్డు స్ధాయిలో బిజినెస్ చేయడం, విదేశాల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయడం, టిక్కెట్ కౌంటర్ స్టార్ట్ చేసిన రెండు గంటల్లోనే టిక్కెట్లు అయిపోవడం...ఏకంగా కబాలి రిలీజ్ రోజు కొన్ని కంపెనీలు సెలవు ప్రకటించడం..ఇలా ఎన్నో రకాలుగా రికార్డులు సృష్టించిన కబాలి ప్రమోషన్స్ లో ఊహించని విధంగా విమానాల పై సైతం కబాలి పోస్టర్స్ తో ప్రమోషన్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా.... కబాలి రికార్డుల గురించి చెప్పాలంటే...చాలా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే....సినిమా పరిశ్రమలో కబాలి ఓ సునామి.