జూన్ మొదటి వారంలో 'కబాలి' పాటలు విడుదల జులై 1న సినిమా విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సినిమా రంగంలో సాటిలేని స్టార్ రజనీకాంత్. ఆయన సినిమా చేస్తున్నారంటే తమిళనాటే కాదు ఇటు సౌత్ అంతటా, అటు నార్త్ లోనూ, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆయన అభిమానులు, సినిమా ప్రేమికులు ఆ చిత్రం కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా అలా వారందరూ ఎదురుచూస్తున్నది `కబాలి` కోసం. నోట్లో కాస్ట్ లీ సిగార్ పైప్‌తో, సాల్ట్ పెప్పర్ లుక్‌తో రాజసంగా కుర్చీలో కూర్చున్న ఆయన ఫస్ట్ లుక్ స్టిల్ కు ఎంతటి స్పందన వచ్చిందో తెలిసిందే. దాన్ని మించిన రెస్పాన్స్ ఈ మధ్య విడుదల చేసిన టీజర్‌కు వచ్చింది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఈ టీజర్ విడుదలైన గంటలోపే వ్యూస్ ఒక మిలియన్ దాటడం ఏ ఇతర హీరో చిత్రాల టీజర్ విషయంలోనూ జరగలేదు. కార్మికుల దినోత్సవాన విడుదలైన ఈ టీజర్ ఇప్పటికే కోటిన్నర వ్యూస్ దాటి సూపర్‌స్టార్ చిత్రానికున్న క్రేజ్‌ను మరోమారు నిరూపించింది. ఇవన్నీ ఓ వైపు అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయన్నది వాస్తవమే అయినప్పటికీ, అందరి దృష్టి ప్రస్తుతం ఆడియో విడుదల తేదీ మీదే ఉంది.
జూన్ మొదటి వారంలో పాటలను, జులై 1న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత కలైపులి.యస్.థాను. ప్రకటించారు.
ఎన్నెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన వి. క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నవిషయం విదితమే. రజనీకాంత్ సరసన రాధికా ఆప్టే నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం గురించి నిర్మాత కలైపులి.యస్.థాను మాట్లాడుతూ ``రజనీకాంత్ సినిమాను నిర్మించడమనేది ఓ నిర్మాతకు అరుదైన అవకాశం. అలాంటిది అంత గొప్ప అవకాశాన్ని రజనీకాంత్‌గారు నన్ను పిలిచి ఇచ్చారు. ఇది నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ కింద లెక్క. `కబాలి` షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన చూసి అందరూ నివ్వెరపోతున్నారు. టీజర్‌లో రజనీ చెప్పిన డైలాగులకు చాలా మంచి స్పందన వచ్చింది. అంతకన్నా గొప్ప డైలాగులు, అభిమానులకు కిక్కెచ్చించే డైలాగులు సినిమాలో చాలా ఉన్నాయి. వాటిని కూడా టీజర్‌లో పెడదామని నేను పా.రంజిత్‌కు చెప్పాను. అయితే వాటిని ఆడియో వేడుకలో విడుదల చేద్దామని రంజిత్ అన్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత గొప్ప దర్శకుల్లో ఒకరిగా పా.రంజిత్‌కు పేరు వస్తుంది. రజనీకాంత్‌గారికున్న సూపర్‌స్టార్ ఇమేజ్‌ను మనసులో పెట్టుకుని టైలర్ మేడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి మాకు ఆయన చెప్పిన తీరును మర్చిపోలేం. సంతోష్ నారాయణ్ చాలా మంచి బాణీలిచ్చారు. సూపర్‌స్టార్ అభిమానులే కాదు మ్యూజిక్ లవర్స్ అందరూ మళ్లీ మళ్లీ వినేలా బాణీలు కుదిరాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాం`` అని చెప్పారు.
రజనీకాంత్, రాధికా ఆప్టే, థన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: సిరివెన్నెల, చంద్రబోస్, అనంతశ్రీరామ్, మేకప్: భాను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: `దేవి-శ్రీదేవి` సతీష్, నిర్మాత: కలైపులి.ఎస్.థాను
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments