'కబాలి' ఆడియో విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కలైపులి థాను సమర్పణలో షణ్ముక ఫిలింస్ బ్యానర్‌పై పా రంజిత్ దర్శకత్వంలో కె.పి.చౌదరి, కె.ప్రవీణ్‌కుమార్ వర్మ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం కబాలి. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా ఆడియో సీడీలను హీరో వరుణ్‌తేజ్ విడుదల చేశారు. టీజర్‌ను హీరో నాని, బ్యానర్‌లోగోను టి.సుబ్బిరామిరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా...
వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ``పెద్దనాన్నగారికి, రజనీకాంత్‌గారికి మంచి స్నేహం ఉండేది. స్విజ్జర్లాండ్‌లో ఇంద్ర షూటింగ్ చేస్తున్న సమయంలో నేను అక్కడకు వెళితే అక్కడే రజనీకాంత్‌గారి బాబా షూటింగ్ జరుగుతుంది. అప్పుడే ఆయన్ను కలిసి మాట్లాడాను. ఆయనెంతో సాధారణంగా ఉంటారో నాకు అప్పుడు అర్థమైంది. ఆయన భాషా తర్వాత అటువంటి పాత్రలో మరే సినిమా చేయలేదు. ఇప్పుడు ఆ తరహాలో కబాలిగా మన ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
హీరో నాని మాట్లాడుతూ ``నాకు డైరెక్టర్ శంకర్గారంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న రోబో2 కంటే కబాలి కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే రజనీకాంత్‌గారిని రోబోగా కంటే భాషాగా చూడాలని ఇష్టపడుతున్నాను. నేను ఆయనకు అభిమానిగా ఆయన్ను ఇమిటేట్ చేయాలని చాలా సార్లు ప్రయత్నించాను. ఆయన స్టయిల్ అంటే ఇష్టపడనివారుండరు`` అన్నారు.
టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ``నాకు రజనీకాంత్ చాలా ఆత్మీయ మిత్రుడు. గొప్ప నటుడు. నేను నిర్మించిన హిందీ రీమేక్ జీవనపోరాటంలో అమితాబ్‌గారి పాత్రలో నటించారు. భారతీయ చలనచిత్ర సీమకు దొరికిన కోహినూర్ వజ్రం ఆయన. ఆయన నటించిన కబాలి గ్యారంటీగా పెద్ద హిట్ అవుతుంది`` అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ``ప్రపంచంలోని వ్యక్తిత్వాన్నంతా ఒకవైపు, రజనీకాంత్‌గారిని మరోవైపు వేస్తే రజనీకాంత్‌గారే కాస్తా ఎక్కువగా తూగుతారు అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రజనీకాంత్‌గారు. ఆయన మమ్మల్ని భాషా సినిమాకు రైటర్స్‌గా వర్క్ చేయమని అడిగితే లిప్ సింక్‌గా డైలాగ్స్ రాయడం తెలియదు సార్ అని అయనతో పనిచేయలేకపోయాం`` అన్నారు.
దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ ``సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను నేను పూర్తి చేశానని అనుకుంటున్నాను. సినిమా విడుదల కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ మాట్లాడుతూ `` తెలుగులో సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను`` అన్నారు.
నిర్మాత కె.పి.ప్రవీణ్‌కుమార్ వర్మ మాట్లాడుతూ ``నేను డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు నా మిత్రుడు కె.పి.చౌదరి సలహాతో కబాలి సినిమాను తెలుగులో విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం.
కె.పి.చౌదరి మాట్లాడుతూ ``మోహన్‌బాబుగారు, అల్లు అరవింద్‌గారు కలైపులిథానుగారికి ఫోన్ చేసి ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్`` అన్నారు.
రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, కిశోర్, జాన్ విజయ్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: మురళీ, సంగీతం: సంతోష్ నారాయణ్, ఆర్ట్: రామలింగం, ఫైట్స్: అన్బరివు, మాటలు: సాహితి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, వనమాలి. మేకప్: భాను, ఎఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: `దేవి-శ్రీదేవి` సతీష్, సమర్పణ: కలైపులి థాను, నిర్మాతలు: కె.పి.చౌదరి, కె.ప్రవీణ్ కుమార్,దర్శకత్వం: పా రంజిత్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com