Download App

Kaasi Review

సెంటిమెంట్ డ్రామా సినిమాలు చేసేట‌ప్పుడు అందులో ఎమోష‌న్స్ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కావాలి. అలాంటి సెంటిమెంట్ డ్రామాల్లో మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో తెర‌కెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో త‌మిళ అనువాద చిత్రం `బిచ్చ‌గాడు` ఒక‌టి. ఈ చిత్రంతో అప్ప‌టికే హీరోగా మారిన మ్యూజిక్ డైరెక్ట‌ర్ విజ‌య్ ఆంటోనికి తెలుగులో మంచి మార్కెట్ అయ్యేంత స‌క్సెస్‌ను ఇచ్చింది బిచ్చ‌గాడు. ఈ సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని సినిమాల‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డ్డాయి. బిచ్చ‌గాడు త‌ర్వాత వ‌చ్చిన భేతాళుడు, యెమ‌న్‌, ఇంద్ర‌సేన చిత్రాలు అనుకున్న స్థాయిలో విజ‌యాల‌ను సాధించ‌లేదు. త‌న‌కు తెలుగులో మంచి ఇమేజ్‌ను ఇచ్చిన బిచ్చగాడు సినిమాలోని మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధానంగా విజ‌య్ ఆంటోని చేసిన సినిమా కాశి. మ‌రి కాశి సినిమా విజ‌య్ ఆంటోనికి మ‌రో స‌క్సెస్‌ను ఇచ్చిందా?  లేదా? అని తెలియాలంటే సినిమా క‌థేంటో తెలుసుకుందాం...

క‌థ‌:

భ‌ర‌త్(విజ‌య్ ఆంటోని) అమెరికాలో పెద్ద డాక్ట‌ర్‌. త‌న‌కు రోజూ ఓ క‌ల వ‌స్తుంటుంది. ఆ క‌ల‌లో త‌న‌ను క‌ర‌వ‌డానికి ఓ పాము, పొడ‌వ‌డానికి ఓ ఎద్దు ప్ర‌య‌త్నిస్తుంటే ఓ మ‌హిళ కాపాడుతుంది. కానీ ఆమె ఎవ‌రో తెలియ‌దు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌న త‌ల్లిదండ్రులు అస‌లు త‌ల్లిదండ్రులు కార‌ని పెంపుడు త‌ల్లిదండ్రుల‌ని తెలుస్తుంది. త‌న గురించి వివ‌రాలు తెలుసుకోవ‌డానికి భ‌ర‌త్ ఇండియా చేరుకుంటాడు. ఆ క్ర‌మంలో త‌న త‌ల్లి పేరు పార్వ‌తి అని తెలుసుకుంటాడు. త‌నను కాపాడే ప్ర‌య‌త్నంలోనే త‌ల్లి ప్రాణాల‌ను కోల్పోయింద‌ని కూడా తెలుసుకుంటాడు. త‌న అస‌లు పేరు కాశి అని కూడా తెలుస‌తుంది. భ‌ర‌త్ అలియాస్ కాశి అక్క‌డ నుండి త‌న తండ్రి ఎవ‌రో తెలుసుకోవ‌డానికి  కంచ‌ర పాలెం గ్రామానికి చేరుకుంటాడు. డాక్ట‌ర్‌గా ప్ర‌జ‌ల‌కు వైద్యం చేస్తూ.... త‌న తండ్రి ఎవ‌రో తెలుసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తాడు?  కాశి ప్ర‌య‌త్నాలు ప‌లించాయా?  కాశి తండ్రి ఎవ‌రో తెలుసుకున్నాడా? క‌లుసుకున్నాడా?  అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్ పాయింట్స్‌:

- తొలి ప‌దిహేను నిషాలు
- క్లైమాక్స్‌
- కెమెరా వ‌ర్క్‌

మైన‌స్ పాయింట్స్‌:

- క‌థ‌ను ఎమోష‌న‌ల్‌గా చెప్ప‌లేక‌పోవ‌డం
- ఎక్కువ ఫ్లాష్ బ్యాక్స్ ఉండ‌టం
- సాగ‌దీసిన‌ట్లుండే క‌థ‌నం

విశ్లేష‌ణ‌:

విజ‌య్ ఆంటోని సీరియ‌స్‌గా ఉండే క‌థ‌నే ఎంచుకున్నాడు. ఈ సినిమాలో విజ‌య్ ఆంటోని నాలుగు డిఫ‌రెంట్స్ గెటప్స్‌లో క‌నిపించాడు. నాలుగు గెట‌ప్స్‌లో లుక్స్ ప‌రంగా డిఫ‌రెంట్‌గా ఉన్నాడు. పాత్ర‌ల‌కు త‌గిన విధంగా త‌న‌వంతుగా న్యాయం చేశాడు. ఇక అంజ‌లి పాత్ర ప‌రిమితం. పెర్ఫామెన్స్‌కు స్కోప్ త‌క్కువ‌గానే ఉండే పాత్ర‌లో అంజ‌లి న‌టించింది. సునైన పాత్ర‌కు మంచి స్కోప్ ఉంది. త‌ను కూడా చ‌క్క‌గా న‌టించింది. సినిమా తొలి ప‌దిహేను నిమిషాలు చ‌క్క‌గా ఉంది. అలాగే క్లైమాక్స్‌లో తండ్రి ఎవ‌రో తెలుసుకునే క్ర‌మంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడో అనే పాయింట్ చ‌క్క‌గా ఉంటుంది. రిచ్చ‌ర్డ్ నాథ‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఇక విజ‌య్ ఆంటోని హీరోగా ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ.. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మెప్పించ‌లేక‌పోయాడు. ట్యూన్స్ విన‌డానికి బావున్నా.. అందులో సాహిత్యం ట్యూన్‌ను కిల్ చేసేసింది. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సో సోగా ఉంది. లారెన్స్ మ‌రికొంత సినిమాను ఎడిట్ చేసుండ‌వ‌చ్చు అనిపించింది. యోగిబాబు డైలాగ్స్ మిన‌మా సినిమాలో కామెడీ ఏదీ ఉండ‌దు. ప్ర‌తి పార్ట్‌లో ఫ్లాష్ బ్యాక్‌లు రావ‌డం.. దానికి త‌గిన‌ట్లు అందులో హీరో క‌న‌ప‌డ‌టం సినిమాను సాగ‌దీత‌గా చేసేశాయి. అలాగే ప్ర‌తి పార్ట్‌లో ఎమోష‌న్స్ లేవు. ఆడియెన్స్‌ను మెప్పించవు.  ప్ర‌ధాన పాయింట్ బాగానే ఉన్నా.. దాన్ని ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించ‌లేక‌పోయారు ద‌ర్శ‌కురాలు కృతిక ఉద‌య‌నిధి. సెంటిమెంట్ సినిమాల్లోని ఎమోష‌న్ ప్ర‌ధానంగా మిస్ అయ్యింది. 

బోట‌మ్ లైన్‌:  కాశి.. ఎమోష‌న‌ల్‌గా మెప్పించ‌లేదు

Kaasi Movie Review in English

Rating : 2.5 / 5.0