Kaala Review
దక్షిణాది సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఇమేజ్ వేరు. ఆయన సినిమాలంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. సామాన్య ప్రేక్షకుడు సినిమా చూడాలని తెగ ఉబలాట పడుతుంటారు. అందుకు కారణం రజనీ నటన, స్టైల్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు.. అంటే రెండేళ్ల తర్వాత రజనీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం `కాలా`. అంతే కాకుండా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని ప్రకటించిన తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రమిది. పేదవాడికి అవసరమైన భూమి అనే విషయాన్ని ఈ సినిమాలో రజనీకాంత్ ప్రస్తావిస్తాడని తెలియగానే సినిమాకు రాజకీయ రంగు పులుముకుంది. అందరూ సినిమాలో రజనీకాంత్ ఎవరిని విమర్శిస్తాడోనని ఆసక్తిగా గమనించసాగారు. అదీ కాక.. కావేరీ జలాల విషయంలో రజనీ స్పందన కూడా కర్ణాటకలో సినిమా విడుదలకు పెద్ద అంతరాయాన్ని కలిగించింది. సినిమా కథ నాది.. కాబట్టి సినిమాపై స్టే విధించాలని ఒకరు కేసు వేశారు. ఇన్ని వివాదాల నడుమ విడుదలైన `కాలా` ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకునే ముందు కథేంటో చూద్దాం...
కథ:
వీరయ్య తనయుడు కాలా(రజనీకాంత్) ముంబై దారావికి మకుటం లేని మహారాజు. అతని అనుమతి లేకుండా అక్కడ ఎవరూ ఏ పని చేయలేరు. అక్కడి ప్రజలకు కాలా అండ కొండంత ఉంటుంది. అయితే దారావి సిటీ మధ్యలో ఉండటంతో.. దానిపై కన్నేస్తాడు హరిబాబా(నానా పటేకర్). రాజకీయ నాయకుడైన హరిబాబా ఎలాగైనా తన ఆదిపత్యంతో, రాజకీయ పలుకుబడితో అక్కడ ప్రజలను తరిమేసి వారికి అపార్ట్‌మెంట్స్ కట్టిస్తానంటాడు. అయితే కాలా అందుకు ఒప్పుకోడు. ప్రభుత్వం సాయం చేస్తే ప్రజలే వారి ఇళ్లను నిర్మించుకుంటారని చెబుతాడు కాలా. అదే సమయంలో జరీనా(హ్యుమా ఖురేషి) కాలాకు అండగా నిలబడుతుంది. దాంతో హరిబాబా కాలా అడ్డు తొలగించుకోవాలనుకుంటాడు. ఆ ప్రయత్నాల్లో కాలా తన భార్య, కొడుకుని కోల్పోతాడు. చివరకు హరిబాబా ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తాడు. గొడవలు సృష్టిస్తాడు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? తన ప్రజలకు ఏవిధంగా న్యాయం చేస్తాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
రజనీకాంత్ తనదైన నటన, స్టైల్, లుక్‌తో ఆకట్టుకున్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ చక్కగా తెరెక్కించారు. ఫ్లై ఓవర్‌పై ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. అలాగే ఇంటర్వెల్‌లో నానా పటేకర్‌ను దారావిలో అందరూ బ్లాక్ చేసే సీన్ బావుంది. ఇక సన్నివేశాలకు తగినట్లు సంభాషణలు ఆకట్టుకుంటాయి. నానా పటేకర్ హరి బాబా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకున్నారు. విలనిజాన్ని కళ్లతోనే పలికించారు. ఇక రజనీకాంత్, విలన్ ఇంటికి వెళ్లిన సన్నివేశం.. ఈశ్వరీరావు నటన, క్లైమాక్స్ కొత్తగా ఉంది. సంతోశ్ నారాయణ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది.
మైనస్ పాయింట్స్:
సినిమా ఫస్టాఫ్ ఆసాంతం చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, హ్యూమా ఖురేషి మధ్య ప్రేమ సన్నివేశాలు బోరింగ్‌గా, సినిమా ఎంట్రా ఇంతలా సాగుతుంది అనేలా ఉన్నాయి. అసలు లవ్ ట్రాక్ కథను అనుసరించి చూస్తే అనవసరం అనిపిస్తాయి. పాటల్లో సాహిత్యం బాలేదు. ట్యూన్స్ బాలేవు.
విశ్లేషణ:
అనాది కాలం నుండి నేటి వరకు మనిషికి అత్యంత అవసరమైనది.. విలువైన వాటిలో భూమి ఒకటి. నేటికీ కూడా చాలా మందికి ఉండటానికి కనీస అవసరాలున్న ఇళ్లు కూడా లేవు. ఇలాంటి సమస్యను మాస్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్ వంటి హీరో చెబితే ఆ రీచింగ్ వేరేలా ఉంటుంది. అదే విషయాన్ని పా. రంజిత్ చక్కగా ఇంప్లిమెంట్ చేశాడు. మంచి కోర్ పాయింట్‌ను తీసుకున్నాడు. దాని చుట్టూనే సన్నివేశాలు అల్లుకున్నాడు. అయితే హ్యూమా ఖురేషి, రజనీకాంత్ మధ్య ప్రేమ సన్నివేశాలు ప్రజలకు భారంగా మారింది. ప్రేక్షకుల సహానాన్ని పరీక్షిస్తుంది. అలాగే పా. రంజిత్‌కు ర్యాప్ టీం పిచ్చి ఎక్కడో పట్టినట్టుంది. కబాలిలో ఓ ర్యాప్ టీంను చూపించినట్లే ఈ సినిమాలో కూడా కథకు ప్రాధాన్యంలేని ర్యాప్ టీం, వారి చేష్టలతో ప్రేక్షకులను విసిగించాడు. అయితే ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ సీన్.. ఇంటర్వెల్‌లోనానా పటేకర్‌ను దారావిలోబ్లాక్ చేయడం సన్నివేశాలు బావున్నాయి. అక్కడి నుండి కథ వేగం అందుకుంటుంది. నానా పటేకర్ దారావిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేయడం.. దాన్ని అడ్డుకోవడానికి రజనీ చేసే ప్రయత్నాలు.. మధ్యలో రజనీ తన భార్య, కొడుకుని కోల్పోవడం వంటి సన్నివేశాలు.. విలన్ నానా పటేకర్ ఇంటికి కాలా వెళ్లిన సందర్భం సహా సన్నివేశాలు బావున్నాయి. క్లైమాక్స్ ఫైట్ బావుంది. మురళి.జి కెమెరా వర్క్ మెప్పించింది. సంతోశ్‌నారాయణ్ ట్యూన్స్ ఆకట్టుకోలేకపోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. ముఖ్యంగా యాక్షన్ పార్ట్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. డైలాగ్స్ బావున్నాయి. రామలింగం వేసిన దారావి సెట్ చాలా బావుంది. ఫస్టాఫ్ స్టో నెరేషన్.. సెకండాఫ్ రజనీ, రంజిత్ మార్కులో సినిమా సాగుతుంది.
బోటమ్ లైన్: అభిమానులను అలరించే 'కాలా'
Kaala Movie Review in English
- Read in English