Download App

Kaadhali Review

తెలుగులో ఎన్నో ముక్కోణపు ప్రేమకథలను ప్రేక్షకులు వీక్షించారు. ఎన్ని ప్రేమకథలు ఉన్నా, ప్రేమను కొత్తగా ఆవిష్కరించిన ప్రతి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి ప్రయత్నమే చేశాడు దర్శక నిర్మాత పట్టాభి ఆర్‌.చిలుకూరి. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు మధ్య సాగే ఈ ప్రేమకథకు రెస్పెక్ట్‌ హర్‌ చాయిస్‌ అనే ట్యాగ్‌లైన్‌ పెట్టడంతో అమ్మాయి పాత్రకు ప్రాముఖ్యత ఇస్తున్నానని చెప్పకనే చెప్పాడు. మరి పటాభి ఇచ్చిన ప్రాముఖ్యతేంటి? అసలు కాదలి ఎవరు? అనే విషయాలు తెలుసుకుందాం..

కథ:

ఉస్మానియా హాస్పిటల్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తుంటుంది బాంధవి(పూజ కె.దోషి). తండ్రి చేసిన మోసం వల్ల తనకు పెళ్ళి కావడం లేదని బాధపడుతూ ఉంటుంది. ఓసారి తనకు కాబోయే భర్తను తనే సెలక్ట్‌ చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఓ రెస్టారెంట్‌లొ కార్తికేయను కలుస్తుంది. ఇద్దరి మధ్య స్నేహం బానే ఉంటుంది. అయితే కార్తికేయకు సంతోషం, బాధ ఏదీ ఉన్నా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతుంటాడు. అలాంటి ఓ సందర్భంలో బాగా డబ్బున్న క్రాంతిని కలుస్తుంది. అయితే క్రాంతికి కోపమెక్కువ. మరి ఇద్దరిలో బాంధవి ఎవరిని పెళ్ళి చేసుకుంటుంది? అసలు చివరకు ఈ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఏ మలుపు తీసుకుంటుంది? అనే సంగతులు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే?

సమీక్ష:

దర్శకుడు పట్టాభి ప్రేమదేశంలోని కొన్ని సన్నివేశాలను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సినిమాను తయారు చేసుకున్నట్లు కనపడింది. రెస్పెక్ట్‌ హర్‌ ఛాయిస్‌ అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు కథను తయారు చేసుకున్నా కథను నడిపించిన తీరు ఎక్కడా ఎంటర్‌టైనింగ్‌గా ఉండదు. ఒక అమ్మాయి తెలియక ఇద్దరు అబ్బాయిల మనసులను గెలుచుకుంటే అందులో అమ్మాయి తప్పు ఉండదు. కానీ ఇందులో హీరోయిన్‌ తెలిసి తెలిసి ఇద్దరి అబ్బాయిల మనసుతో ఆడుకుంటుంది. ఇదెంత వరకు కరెక్ట్‌ అయిన పాయింటో దర్శకుడికే తెలియాలి. ఇది ప్రేక్షకులకు కన్విన్సింగ్‌గా అనిపించదు. నటీనటుల విషయానికి వస్తే సాయిరోనక్‌, హరీష్‌, పూజలు దర్శకుడిని ఫాలో అయినా, ఎక్స్‌ప్రెసివ్‌గా ఉంటే ఇంకాస్తా ఎమోషనల్‌గా ఆడియెన్‌ కనెక్ట్‌ అవుతాడు. శేఖర్‌ వి.జోసెఫ్‌ సినిమాటోగ్రఫీ పరావాలేదు. బాంధవి తనకు కాబోయే భర్తను ఎంపిక చేసుకోవడంలో ఆలస్యం చేయడం, ఇద్దరు హీరోలను బాధ పెట్టడం మరీ ఎక్కువయ్యాయి. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు మరి బోర్‌ కొట్టిస్తాయి. శ్రీలంక, గోవాలో చిత్రీకరించిన సాంగ్‌ లోకేషన్స్‌ బావున్నాయి. కొన్ని సన్నివేశాల్లో నాయకానాయికల నటన ఓవర్‌గా అనిపిస్తుంది. ప్రసన్‌ ప్రవీణ్‌ శ్యామ్‌ బాగా లేదు. మొత్తంగా కాదలి అనే సినిమా ప్రేక్షకుడికి అసహనాన్ని కలిగిస్తుంది.

బోటమ్‌ లైన్‌: కాదలిని ప్రేమించలేం

Kadhali English Version Review

Rating : 2.0 / 5.0