'ఏపీలోని 175 స్థానాల్లో పోటీ.. నియోజకవర్గానికి వంద కోట్లిస్తా'
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎప్పట్నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి తర్వాత వైసీపీ, టీడీపీ, జనసేన అధినేతలు వారి పార్టీల అభ్యర్థులను కూడా ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో తమ పార్టీ కూడా బరిలో ఉంటుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే బరిలోకి దిగుతుమంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తేల్చిచెప్పారు. సోమవారం నాడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలోని 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని.. ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ఒక్కో నియోజకవర్గం అభివృద్ధి కోసం రూ.100 కోట్లు విరాళంగా ఇస్తానని పాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతానికి అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తాము సిద్ధంగా లేమని.. ఒకవేళ పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఐదో, పదో సీట్లు ఇస్తామని.. ఎవరితో అనేది మార్చిలో తేలుస్తామన్నారు. అంతటితో ఆగని ఆయన.. 20 రోజుల్లో ప్రజాశాంతి పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని తనకు తానుగా జోస్యం చెప్పుకున్నారు. పార్టీలో వెయ్యిమందిని చేర్పించిన వారికి మూడువేల రూపాయిలు చొప్పున నగదు ఇస్తానని.. ఎక్కువ మందిని చేర్పించిన వారికి ఎమ్మెల్యే సీటిస్తామని కూడా ప్రకటన చేశారు.
అయితే.. పాల్ ప్రకటనతో నవ్వుకున్నోళ్లు నవ్వుకున్నారు.. నమ్మే వాళ్లు నమ్మారు.. ఇక సోషల్ మీడియాలో అయితే బాబోయ్ ఇన్ని రోజులు ఒకటి అర ఇంటర్వ్యూల్లోనే ఇప్పుడు ఏకంగా మీడియా ముందుకే వచ్చేశావా సామీ.. ఇక కామెడీకి కొదవేమీ ఉండదులే అంటూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇవన్నీ అటుంచితే ఆయనకు ఒకప్పుడు విదేశాల్లో ఏ రేంజ్‌లో పేరున్నదో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల ఆయన తెలుగు రాష్ట్రాల ప్రజలకు కనిపించకుండా వెళ్లిపోయారు. త్వరలో ఎన్నికల దగ్గరపడుతున్న సమయంలో ఆయన మళ్లీ ప్రత్యక్షమవ్వడంతో ఆయన అసలేం చేయబోతున్నారు..? మళ్లీ పాత పాల్ క్రీజులోకి వచ్చేశారా..? అనేది తెలియరాలేదు. అయితే ఒకవేళ పాల్ ఫుల్‌పిల్‌గా ఏపీలో పోటీ చేస్తే పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments