close
Choose your channels

'ఓం నమో వేంకటేశాయ' సినిమా చేయడం నా దృష్టిలో ఓ స్పిరుచ్యువల్ జర్నీ - కె.రాఘవేంద్రరావు

Tuesday, February 7, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని రూపొందించారని దర్శకనిర్మాతలను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

ఈ స‌ద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావుతో ఇంట‌ర్వ్యూ....

ప్రేక్ష‌కులు ఆ అనుభూతికి లోన‌వుతారు...
- హ‌థీరాంబాబా గొప్ప భ‌క్తుడు. ఒక అడ్మినిస్టేష‌న్‌, ఒక సిస్ట‌మ్‌ను పెట్టినవాడు. అన్న‌మ‌య్య 32 వేల కీర్త‌ల‌నలు రాశాడు. ఆ చ‌ర‌ణాల‌న్నింటిలో వెంక‌టేశ్వ‌ర‌స్వామియే స‌బ్జెక్ట్‌. మ‌రో దేవుడు పేరు గుర్తు చేసుకోకుండా త‌న జీవితాన్ని వెంక‌టేశ్వ‌ర‌స్వామికి అంకితం చేశాడు. రామ‌దాసు భ‌జ‌న సంస్కృతికి అద్యుడుగా పేరు తెచ్చుకుంటాడు. ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో కొండ మీద‌కు వ‌చ్చిన భ‌క్తుడితో దేవుడు పాచిలాడ‌టం. అనేది 500 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన ఒక చరిత్ర‌. అది ఊహించుకుంటేనే ఒక అనుభూతికి లోన‌వుతాం. దేవుడు, భ‌క్తుడు స్నేహితుల్లా మాట్లాడుకోవ‌డం, తమ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకోవ‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. దేవుడి మాట్లాడితే ఎలాంటి అనుభూతి క‌లుగుతుందో ఈ సినిమా చూస్తే అలాంటి అనుభూతే ప్రేక్ష‌కుల‌కు క‌లుగుతుంది.
రెండింటికీ పోలిక లేదు...
- అన్న‌మ‌య్య‌, ఓం న‌మో వేంక‌టేశాయ సినిమాలు రెండు వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుల క‌థ‌లే. అయితే అన్నమయ్య` పూర్తిగా భక్తుడి కోణంలోనుంచి చెప్పిన కథ. ఓం నమో వెంకటేశాయ` కూడా భక్తుడి కోణంలోనే చెప్పినా, ఇందులో వెంకటేశ్వరస్వామితో భక్తుడి స్నేహం అన్న మరో కొత్త కోణం కూడా ఉంది.అలాగే క‌థ‌లోని ఎమోష‌న్స్ డిఫ‌రెంట్‌గా ఉంటాయి కాబ‌ట్టి రెండు సినిమాల‌కు పోలిక లేదు.
అవి తెలిస్తే చాలు...
- మ‌న క‌థ‌కు కావాల్సిన అంశాల్లో ముఖ్య‌మైన ఎలిమెంట్స్ తెలిస్తే చాలు. ఆ స‌మాచారంతో కొంత‌ సినిమాటిక్ లిబర్టీతో ఫిక్షన్ జత చేసి సినిమాను రూపొందించాం. అంటే సినిమాలో ఉండేవ‌న్నీ జ‌రిగాయ‌ని కాదు, మ‌న‌కు తెలిసిన ఇన్‌ఫ‌ర్మేష‌న్ కొంత అయితే జ‌త చేసింది కొంత. అన్న‌మ‌య్య సినిమా స‌మ‌యంలో కూడా చివ‌రి భాగాన్ని డ్ర‌మ‌టైజ్ చేసి సినిమాగా తీశాం. ఇలాంటి సినిమాల్లో జ‌రుగుతూనే ఉంటాయి.
ముందు ఒప్పుకోలేదు...అన్న‌మ‌య్య సినిమాతో పోల్చుకుని నాగార్జున అయితే సినిమా వ‌ద్ద‌ని అన్నాడు. అయితే నేను ముందు క‌థ విన‌మ‌ని చెప్పాను. స‌రేన‌ని క‌థ విన్నాడు. విన‌గానే త‌న‌కు బాగా న‌చ్చేసింది. అన్న‌మ‌య్య సినిమాలో క్లైమాక్స్ ఎంత బావుంటుందో ఈ సినిమాలో క్లైమాక్స్ అంత హైలైట్‌గా ఉంటుంది.
నాగార్జున త‌ప్ప ఎవ‌రూ చేయలేరు...
- ఇతర హీరోలు ఒప్పుకుంటారో లేదో తెలియదు. హథీరామ్‌బాబా పాత్రను నాగార్జున మాత్రమే చేయగలడనిపించింది. అన్నమయ్య కన్నా గొప్ప సినిమా చేస్తున్నామని కథ వినమని చెప్పాను. పదినిమిషాల్లోనే ఓకే చెప్పాడు.
ఆ మహ‌త్యాన్ని చెప్పే చిత్రం...
- తిరుపతికి వచ్చే భక్తుల్లో ఎక్కువమంది యూత్ ఉంటున్నారు. మొక్కులు తీర్చుకుంటే పనులు అవుతాయని విశ్వసించే వారిలో వారే అధికశాతం ఉంటున్నారు. అలాంటి వారికి తిరుపతి మహత్యమేమిటో తెలియజెప్పే చిత్రమిది. దానికి కలియుగవైకుంఠం అనే పేరు ఎందుకొచ్చింది? ప్రపంచంలోనే అత్యధిక ప్రాచుర్యాన్ని పొందిన దేవస్థానంగా ఎందుకు నిలిచింది? నీలాద్రి, గరుడాద్రి ప్రాశస్తి ఏమిటి? ఇలా తిరుమల క్షేత్రానికి సంబంధించి ఎవరికి తెలియని అనేక విషయాల్ని ఈ సినిమాలో చర్చించాం. సినిమా చూసిన తర్వాత తిరుపతి పట్ల ప్రతి ఒక్కరి దృక్పథంలో మార్పు వస్తుంది. అవే యువతరానికి నచ్చుతాయని అనుకుంటున్నాను.
దేవుడే చేయించాడు...
- నాగార్జున‌తో ఓం న‌మో వేంక‌టేశాయ వంటి సినిమా చేయ‌డం చూస్తే ఆ దేవుడే రాసిపెట్టి చేయించాడేమో అనిపిస్తూంటుంది. భక్తుడంటే అందరికీ నాగార్జునే గుర్తొచ్చేలా ఈ సినిమాలోనూ రామ్ బాబాగా ఆయన నటన అద్భుతం. కొన్ని సన్నివేశాలు తీసేప్పుడు నేనే చాలా ఎమోషనల్ అయిపోయి కట్ కూడా చెప్పేవాడిని కాదు. సెట్లో ఉన్న అందరికీ నాగ్‌ని చూస్తే రామ్ బాబాను చూసినట్టే అనిపించేంది. మా కాంబినేషన్‌లో ఇలా ఇన్ని భక్తిరస చిత్రాలు రావడం అదృష్టం. భక్తిరస చిత్రాలు నేనొక్కడినే తీయగలనని ఏమీ లేదు. ఏ దర్శకుడైనా చేయొచ్చు. ఒక్క భక్తిరస చిత్రాలనే కాకుండా నిజ జీవిత కథలు, పురాణాలు.. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పే కథలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పటి దర్శకులంతా ఈ తరహా సినిమాలు చేసేయొచ్చు.
తపస్సులా జరిగింది...
- ఓం న‌మో వేంక‌టేశాయ నా దృష్టిలో ఒక స్పిరుచ్చువ‌ల్ జ‌ర్నీ. సాధార‌ణంగా సోష‌ల్ సినిమాలు, భక్తి సినిమాలు తీస్తుంటాం. మొత్తం క‌థ రెడీ చేసుకుని ఏ రోజు తియ్యాల్సిన సీన్‌ను ఆరోజు తీస్తాం. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే మొత్తం అంతా ఓ త‌పస్సులా జ‌రిగింది. యూనిట్ అంతా ఋషులుగా మారిపోయారు. యూనిట్‌లో అన్ని మ‌తాల‌వారు ఉంటారు. సినిమా షూటింగ్‌ని టెంపుల్ సెట్‌తో స్టార్ట్ చేయ‌డంతో టోట‌ల్ సెట్ అంతా భ‌క్తి వాతావ‌ర‌ణంతో నిండిపోయింది. అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయకా..అనే పాట‌తో సినిమాను మొద‌లు పెట్ట‌డంతో యూనిట్‌లో అంద‌రూ గోవింద నామాలు పెట్టుకుని వ‌ర్క్ చేశారు. అంద‌రూ కలిసి ఓ స్పిరుచ్చువ‌ల్ జ‌ర్నీ చేసిన‌ట్టు కాకు అనిపించింది. షూటింగ్ పూర్తి అయిన ప్ర‌తి రోజూ అంద‌రూ గోవింద నామ‌స్మ‌ర‌ణ చేసేవారు.
రిస్క్ అనిపించ‌లేదు...
- రిస్క్ ఏమీ లేదు. నిజం చెప్పాలంటే ఒక మంచి ఎమోషన్‌తో ఓ కథ చెప్తే, అది ఏ జానర్ సినిమా అయినా ప్రేక్షకులు చూస్తారు. కమర్షియల్ సినిమాలనే ఎక్కువగా ఇష్టపడే యూత్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారన్న నమ్మకం ఉంది. ఓం నమో వెంకటేశాయ కథ అలాంటిది. మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలే తీసుకున్నాం. తిరుమలలో షూటింగ్‌ చేయడానికి ఎప్పుడూ అవకాశం లేదు కాబట్టి అందుకోసం కెమెరామేన్ ఎస్.గోపాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కలిసి కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి చిక్‌మంగళూరు, మహాబలేశ్వరం లొకేషన్స్‌ను ఎంపిక చేశారు. నేను, రచయిత జేకే భారవి కలిసి ఇక్కడ కాస్ట్యూమ్స్, సినిమాటిక్‌గా ఈ కథను ఎలా మార్చొచ్చు అని నిరంతరం కష్టపడుతూ ఉండేవాళ్ళం. సెట్స్‌పైకి వెళ్ళాక ఆ దేవుడి దయవల్లే ఒక్క ఆటంకం కలగకుండా సినిమా పూర్తైంది.
ఆ సినిమా తర్వాత నా దృక్ప‌థం మారింది...
అన్నమయ్య తర్వాత నా ఆలోచన దృక్పథం మారింది. విశ్వనాథ్, బాపు కంటే నేను గొప్పవాడిని కాదు. కానీ అలాంటి గొప్ప దర్శకులకు రాని అవకాశం అన్నమయ్య సినిమాతో దేవుడే నాకు ఇచ్చాడని అనిపించింది. కథ వినగానే షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతామా అని ఆసక్తిగా ఎదురుచూశాను. అదే అనుభూతి ఓం నమో వేంకటేశాయతో కలిగింది. అన్నమయ్య తరహాలో ఇందులో పతాక ఘట్టాలు అలరిస్తాయి. భగవంతుడు తన కష్టాలను భక్తుడితో పంచుకునే సన్నివేశాలు మెప్పిస్తాయి.
నాకు తెలిసి అదే కమర్షియాలిటీ...
- యాక్షన్, కామెడీ ఉంటేనే కమర్షియల్ సినిమా కాదు. ఎక్కువ మంది చూసేదే నా దృష్టిలో అసలైన కమర్షియల్ సినిమా. అన్నమయ్య చేస్తున్న సమయంలో కథలో లేని కొన్ని సన్నివేశాల్ని కల్పితంగా చెప్పాం. అవే అందరిని మెప్పించాయి. ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేయడమే కమర్షియాలిటీ అని భావిస్తాను.
అనుష్క పాత్ర గురించి...
- కృష్ణమ్మ అనే మహాభక్తురాలిగా అనుష్క కనిపిస్తుంది. సినిమాలోని సన్నివేశాలు బలంగా పండటం కోసం కల్పితంగా సృష్టించిన పాత్ర ఇది.
నిర్మాత మహేష్‌రెడ్డి సంస్థలోనే ఓం నమో వేంకటేశాయ సినిమా చేయడం...
- నిర్మాత ఏ.మహేష్‌రెడ్డి సంకల్పబలమే ఈ సినిమాకు మూలమైంది. శిరిడిసాయి తర్వాత మళ్లీ అదే కాంబినేషన్‌లో సినిమా చేయాలనుందని, ఎప్పుడు దేవుడి సినిమా మొదలుపెట్టినా చెప్పండని ఆయన అన్నారు. చరిత్రలో నిలిచిపోయే సినిమా చేయాలనే ఆయన నమ్మకమే ఈ సినిమా ప్రారంభానికి దోహదపడింది.
ఓపిక ఉన్నంత కాలం సినిమాలు చేస్తాను....
భక్తి సినిమాల పరంగా ఆ మాటను చెప్పాను. ప్రేమ్‌నగర్ లాంటి గొప్ప సినిమా తర్వాత దానికంటే మంచి సినిమా చేయలేమని, దాని తర్వాత తర్వాత రిటైర్ అవుతే బాగుంటుందని నాగేశ్వరరావు అన్నారు. అలాంటి ఉద్దేశ్యంతోనే ఇదే నా చివరి సినిమా అని నేను అన్నాను. నేను చెప్పిన భావన వేరు. ఓపికున్నంత కాలం సినిమాలు చేస్తాను. 50 ఏళ్లుగా సినిమా రంగంలో కొనసాగుతున్నాను. దాదాపు 40 ఏళ్లుగా దర్శకత్వం చేస్తున్నాను. ఇన్నేళ్లలో ప్రతి ఏడాది సినిమాలు చేశాను. హిట్ వచ్చిన ప్రతిసారి నా బాధ్యత మరింత పెరిగింది. డబ్బుల కోసం ఆలోచించి ఉన్న పేరును చెడగొట్టుకోకుండా మంచి సినిమాలు చేయాలనే తపించాను. డబ్బు కోసం ఇప్పటివరకూ దర్శకత్వం చేయలేదు. నచ్చింది చేసుకుంటూ వెళుతున్నాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment