కొత్త హీరోల సినిమాలెన్నో బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం సందడి చేస్తుంటాయి. అయితే ప్రేక్షకుల అటెన్షన్ సంపాదించుకునే సినిమాలు అందులో కొన్నే. చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయడం. వినాయక్, బొత్స సత్యనారాయణ వంటి వారు ఆడియో వేడుకలో పాల్గొనడంతో జువ్వ అనే సినిమాకు కాస్త ప్రాచుర్యం దొరికింది. దీనికి తోడు రాజమౌళి దర్శకత్వ శాఖలో పనిచేసి.. `దిక్కులు చూడకు రామయ్యా` సినిమాతో దర్శకుడిగా మారిన త్రికోటి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. కీరవాణి సంగీతం అందించడం ఇత్యాది విషయాలు జువ్వపై ఆసక్తిని పెంచాయి. మరి ఈ జువ్వ తారా జువ్వలా దూసుకెళ్లిందా? లేక తుస్సుమందా? అని తెలుసుకోవాలంటే సినిమా కథలోకి వెళదాం.
కథ:
చిన్న వయసున్న శ్రుతిపై ఉన్మాది బసవరాజ్ పాటిల్(అర్జున) కన్నేస్తాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంబడిపడతాడు. బసవకు మంచి చెప్పడానికి ప్రయత్నించిన టీచర్‌ను చంపి జైలుకెళతాడు. కోర్టు బసవకు 14 ఏళ్లు శిక్ష విధిస్తుంది. అయితే జైలు నుండి బసవ బయటకు వచ్చిన తర్వాత అయిన తన కూతురు శ్రుతికి ప్రమాదం ఉంటుందని గ్రహించిన ఆమె తండ్రి.. ఆమెను ఎవరికీ తెలియని ప్రదేశానికి పంపేస్తాడు. శ్రుతి పెరిగి పెద్దదవుతుంది. ఆమెకు రానా (రంజిత్) పరిచయమవుతాడు. ఆమెను ప్రేమిస్తాడు. ఆమె వెనుకే ఉన్న ఆపదను కూడా హీరో అర్థం చేసుకుని ఆమెకు అండగా నిలబడాలనుకుంటాడు. అదే సమయంలో బసవ జైలు నుండి బయటకొస్తాడు. శ్రుతి గురించి వెతకడం మొదలు పెడతాడు. అప్పుడు శ్రుతిని రానా ఎలా రక్షించుకున్నాడనేదే కథ. తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
హీరో ..హీరోయిన్‌ను చూసి ప్రేమిస్తాడు. అయితే ఆమెకు విలన్ నుండి ఆపద ఉంటుంది. ఆ ఆపద నుండి హీరో ఆమెను ఎలా రక్షించాడనే కాన్సెప్ట్ మీద తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి కాన్సెప్ట్‌తోనే త్రికోటి జువ్వ కథను తయారు చేసుకున్నాడు. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలతో పాటు కొన్ని కామెడీ సీన్స్‌తో నడిపించేశారు. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలవుతుందో అక్కడ సినిమా కాస్త జోరు అందుకుంటుంది కానీ కథ పరంగా ఇందులో కూడా ప్రేక్షకుడికి కొత్తదనం కనపడదు. శ్రుతిని బసవరాజు నుండి తప్పించడానికి రానా చేసే ప్రయత్నాలు ఎన్నో తెలుగు సినిమాల్లో చూసిన లాజిక్ లేని సన్నివేశాలతో కూడి ఉంటుంది. కథ ఏం లేకపోవడంతో సినిమాను అటు ఇటు తిప్పి సాగదీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు త్రికోటి. క్లైమాక్స్‌లో రొటీన్ సన్నివేశాలు.. కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ లేకపోవడం ఇత్యాది ప్రేక్షకుడి సినిమా పట్ల విరక్తిగా క్రియేట్ చేస్తాయి. రత్నం కథలో కొత్తదనం లేదు. ఇక రంజిత్ కొత్తవాడైనా డాన్సులు, ఫైట్స్ పరంగా ఓకే అనిపించాడు. పాలక్ లల్వాని తన పాత్రకు న్యాయం చేసింది. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, అర్జున, అలీ, సప్తగిరి, భద్రం తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. కీరవాణి సంగీతం, సురేశ్ కెమెరా పనితనం సినిమా ఎసెట్ అయ్యాయి.
బోటమ్ లైన్: రొటీన కథ, కథనం, ఆసక్తికరంగా లేని సన్నివేశాలతో 'జువ్వ' కాస్త తుస్సుమంది.
Comments