Akbaruddin:వైయస్సార్ హయాంలోనే ముస్లింలకు న్యాయం జరిగింది: అక్బరుద్దీన్
Send us your feedback to audioarticles@vaarta.com
ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించలేకపోయాయని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలిపారు. అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తీర్మానంపై ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షం సభ్యులు అధికారం వైపు.. అధికార సభ్యులు విపక్షం వైపు కూర్చున్నారని.. తాము మాత్రం తటస్థంగా ఒకే చోట ఉన్నామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ముస్లింలు దగ్గరగా ఉండటానికి దివంగత వైఎస్ఆర్ మాత్రమే కారణమని.. ఆయన హయాంలోనే మైనార్టీలకు న్యాయం జరిగిందని కొనియాడారు.
పాతబస్తీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని కోరారు. తాము కూడా పాతబస్తీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఇమామ్‌లకు ప్రస్తుతం రూ.12వేలు ఇస్తున్నారని దానిని రూ.15వేలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. మదర్సా బోర్డును కూడా ఏర్పాటు చేయాలన్నారు.పెండింగ్‌లో ఉన్న షాదీ ముబారక్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే డీఎస్సీలో ఉర్దూ పోస్టులను కూడా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తుందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలమనే గవర్నర్ తన ప్రసంగంలో చదివారని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇష్టానుసారం ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారు? అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు పూర్తిస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు తెలపలేదని కేవలం మేజిక్ ఫిగర్‌కు నాలుగు సీట్లు ఎక్కువే ఇచ్చి గెలిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని గవర్నర్ ప్రసంగంలో చెప్పించారని బీజేపీ కూడా తెలంగాణకు మద్దతు పలికిందనే విషయం మరిచిపోవద్దన్నారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేదా? అని నిలదీశారు.
రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని కామారెడ్డి స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయినా ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సీనియర్ మంత్రులందరి సలహాలు తీసుకొని రేవంత్ రెడ్డి ముందుకు సాగాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఐపీఎస్ కాదు, సీనియర్ మంత్రులు కానిస్టేబుల్స్ కాదు, ఎమ్మెల్యేలు హోంగార్డులు కాదని చురకలు అంటించారు. రేవంత్ గతంలోని దూకుడు తగ్గించుకొని హుందాగా రాష్ట్రాన్ని పాలిస్తారని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout