సుప్రీం సీజేగా తెలుగు తేజం జస్టిస్ ఎన్‌వీ రమణ
- IndiaGlitz, [Wednesday,March 24 2021]
అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం బాధ్యతలు చేపట్టనుంది. జస్టిస్ ఎన్‌వీ రమణ భారత దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా బాధ్యతలు స్వీకరించేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సిఫారసు మేరకు ఎన్‌వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. వచ్చే నెల 23న జస్టిస్ బాబ్డే పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడి పేరును సిఫారసు చేయాలని ప్రభుత్వం సీజేఐని కోరింది.
ఎస్‌ఏ బాబ్డే తన వారసుడిగా ఎన్‌వీ రమణ పేరును సూచించినట్టు సమాచారం. దీంతో జస్టిస్ ఎన్‌వీ రమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జిగా ఉన్నారు.
తెలుగు తేజం అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారనే న్యూస్ బయటకు రావడంతో ఆయన కుటుంబంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. జస్టిస్ రమణ ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేస్తారు. 1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు. జస్టిస్ రమణ 2022 ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోయే రెండో వ్యక్తిగా ఎన్‌వీ రమణ రికార్డు సృష్టించబోతున్నారు. సీజేఐగా తొలిసారి బాధ్యతలు నిర్వహించిన తెలుగు తేజం జస్టిస్ కోకా సుబ్బారావు. ఆయన 1966-1967 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు.