ఆయన టీడీపీలోకి.. ఈయన వైసీపీలోకి..!?
- IndiaGlitz, [Thursday,February 28 2019]
ఇద్దరూ సీనియర్లే.. ఒకరికొకరేం తక్కువ కాదు.. ఒకరు టీడీపీలో ఉంటే ఇంకొకరు మరో పార్టీలో ఉంటారు. అలా ఇప్పటి వరకూ పొలిటికల్ ప్రయాణం సాగించారు. అయితే 2014 ఎన్నికల తర్వాత ఇద్దరూ ఎవరింట్లో వాళ్లు ఉండిపోయారు. మళ్లీ 2019 ఎన్నికలకు సమయం ఆసన్నమవ్వడంతో మళ్లీ బయటికొచ్చి ఏ పార్టీలోకి చేరాలి..? మన ప్రత్యర్థి ఏ పార్టీలో ఉన్నారు..? మనం ఏ పార్టీలో చేరాలి అని ఆలోచనలో పడ్డారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనుకుంటున్నారా.. కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు.
దాడి-కొణతాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ మధ్య దాడి వైసీపీ వైపు మొగ్గు చూపుతుండగా.. కొణతాల మాత్రం టీడీపీలో చేరాలని చాలా రోజుల క్రితమే ఫిక్సైపోయారు. అయితే పైకి మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు. తాజాగా వైసీపీలో చేరిక విషయమై దాడి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చేరాల్సిందిగా తనను ఆ పార్టీ నాయకులు కోరుతున్నారన్నారు. అయితే పార్టీలో చేరికపై అనుచరుల సలహాలు, సూచనల మేరకు చేరతానన్నారు. అయితే దాడికి బద్ధశత్రువు అయిన కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావు వైసీపీలో చేరడానికి చాన్స్ ఎక్కువగా ఉందని.. కచ్చితంగా ఆ పార్టీలోనే చేరతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఎవరు ఏ పార్టీలో ఉన్నా సరే.. స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వొద్దని ఆయన అన్ని పార్టీలకు సూచించారు.
కాగా.. దాడి వీరభద్రరావు ఇప్పటికే మూడు సార్లు టీడీపీ తరఫున గెలిచారు. అయితే కొణతాల మాత్రం ఒకే ఒక్కసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు. నాటి నుంచి ప్రత్యర్థి ఏ పార్టీలో ఉంటారో.. దానికి వ్యతిరేకంగానే దాడి ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా మూడు సార్లు ఆయన టీడీపీ తరఫున గెలిచినప్పుడు.. కొణతాల కాంగ్రెస్‌లోనే ఉన్నారు. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరూ రీ-ఎంట్రీ ఇస్తు్న్నారు. కొణతాల మళ్లీ వైసపీలోకి కొణతాల వెళ్లే అవకాశాలు ఎలాగూ లేవు..ఆయనకున్న ఒకే ఒక్క ఆఫ్షన్ టీడీపీ మాత్రమే. ఆయన టీడీపీలో చేరితే దాడి మరుసటి క్షణమే ఏ మాత్రం ఆలోచించకుండా వైసీపీ కండువా కప్పుకుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. సో.. ఎవరు ఏ పార్టీలో చేరతారో తెలయాలంటే అటు కొణతాల గానీ.. దాడి గానీ ఏదో ఒక కండువా కప్పుకుంటే గానీ ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చేలా లేదు. ఈ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి.