Kavitha:కవితకు జ్యుడిషియల్ రిమాండ్.. తిహార్ జైలుకు తరలింపు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ తగిలింది. ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే మరో 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఈడీ తరపున జోయబ్ హుస్సేన్ వర్చూవల్గా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటికే 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చినందున ఇకపై కుదరదని న్యాయస్థానం స్పష్టంచేసింది. దీంతో ఆమెకు ఏప్రిల్ 9వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తున్నట్లు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.
కోర్టు ఆదేశాలతో కవితను తిహార్ జైలుకు తరలించనున్నారు. ఇప్పటికే ఈ జైలులో నిందితులు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సుఖేశ్ చంద్రశేఖరన్ వంటి వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇదిలా ఉంటే పిల్లలకు పరీక్షలు ఉన్నందున తనకు మధ్యంతరబెయిల్ ఇవ్వాలని కోర్టును కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 1న విచారణ చేపడతామని పేర్కొంది. నేటితో కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టులో కవితను హాజరుపర్చారు.
ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ " కడిగిన ముత్యం లాగా బయటికి వస్తా. తాత్కాలికంగా జైల్లో పెడతారు. మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర. మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు బీజేపీలో చేరారు. మరో నిందితుడు బీజేపీ కూటమిలో పోటీ చేస్తున్నారు. అలాగే మూడో నిందితుడు బీజేపీకి రూ.50కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ విరాళాలు ఇచ్చారు" అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కాగా లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అనంతరం కస్టడీ ముగియడంతో మరో 3 రోజులు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో 10 రోజుల పాటు కవితను అధికారులు విచారించారు. మరోవైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది. అయితే ఆయన ఈడీ ఆఫీస్ నుంచే సీఎంగా పరిపాలన చేస్తున్నారు. మంత్రులకు పాలనపై కీలక ఆదేశాలు ఇస్తున్నారు. ఆయన అరెస్ట్ అయినా కూడా జైలు నుంచే పరిపాలన చేస్తారని మంత్రులు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల వేళ లిక్కర్ కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments