Kavitha: ఈనెల 23 వరకు కవితకు జ్యుడీషియల్ కస్టడీ.. బీజేసీ కస్టడీ అంటూ వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పుడల్లా ఊరట లభించేలా కనిపించడం లేదు. తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు ఈ నెల 23 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నేటితో సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించాలని సీబీఐ కోరగా.. 9 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో ఆమెను తిహార్ జైలుకు తరలించారు. మరోవైపు మనీల్యాండరింగ్ కేసులో కవితకు సంబంధించి రెగ్యులర్ బెయిల్ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కవితను జ్యుడీషియల్ కస్టడీకి పంపించాల్సిన అవసరం లేదని ఆమె తరపున న్యాయవాదులు కోరినప్పటికీ న్యాయమూర్తి వారి వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు.
అంతకుముందు కోర్టుకు హాజరయ్యే క్రమంలో కవిత మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేశారు.. ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ అన్నారు. బయట బీజేపీ వాళ్లు మాట్లాడిందే లోపల సీబీఐ వాళ్లు అడుగుతున్నారని చెప్పారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు. కాగా ఈ కేసులో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమెను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్ర ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సీబీఐ కేంద్ర కార్యాలయంలో కలిసి ధైర్యం చెప్పారు. న్యాయం తమవైపే ఉందని, అధైర్యపడవద్దని తెలిపారు.
మనీలాండరింగ్ కేసులో గత నెల 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. సరిగ్గా నేటితో ఆమె అరెస్టై నెల రోజులు అయింది. తొలుత 10 రోజులు ఈడీ కస్టడీలో ఉండగా.. మార్చి 26న కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించండతో తిహార్ జైలులో ఉంటున్నారు. ఇదే కేసులో ఈనెల 11న సీబీఐ ఆమెను అరెస్ట్ చేసింది. మూడు రోజులు కస్టడీ విధించడంతో సీబీఐ కేంద్ర కార్యాలయంలో ఆమెను విచారించారు. లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఆమె కుట్రలు పన్నారని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments