Kavitha:లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా
- IndiaGlitz, [Thursday,May 02 2024]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బెయిల్ కోసం మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు. సీబీఐ అరెస్ట్ చేసినందున తనకు బెయిల్ ఇవ్వాలన్న కవిత పిటిషన్‌పై ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. అయితే రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఈ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేశారు. అదే రోజు ఈడీ కేసులో బెయిల్ పిటిషన్‌పై కూడా తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 22న వాదనలు జరిగాయి.
ఈ సందర్భంగా కవిత తరఫు నాయవ్యాది వాదిస్తూ మహిళగా కల్వకుంట్ల కవిత బెయిల్‌కు అర్హురాలని వాదించారు. ఆమె అరెస్ట్ నుంచి విచారణ వరకు కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే ఎందుకు సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారని.. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపైనర్ అని.. ప్రచారం కోసం బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అలాగే ఆమె పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందని.. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని వాదించారు.
అయితే లిక్కర్ కేసును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు. లిక్కర్ స్కాం కేసులో కవిత కీలకంగా ఉన్నారని.. బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసునని.. ఇతరులు ఇచ్చిన స్టేట్‌మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కవిత కింగ్ పిన్ అని.. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే బెయిల్‌పై తీర్పును న్యాయస్థానం ఈనెల 6కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
కాగా లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైలులో కవిత ఉన్నారు. మళ్లీ ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ కూడా ఇదే కేసులో కవితను అరెస్టు చేసింది. ఈ రెండు కేసులు సంబంధించి ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోసం కవిత కోర్టును ఆశ్రయించగా.. సోమవారం తీర్పు రానుంది. దీంతో కోర్టు తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.