‘‘ఇది పద్దతిగా లేదు ’’.... జూనియర్ ఎన్టీఆర్ ఉగ్రరూపం, ఫ్యాన్స్‌కు వార్నింగ్

  • IndiaGlitz, [Tuesday,December 21 2021]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’. సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై నగరాల చుట్టూ యూనిట్ మొత్తం పరుగులు పెడుతోంది. దీనిలో భాగంగా ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో 'ఆర్ఆర్ఆర్' ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. బాలీవుడ్‌ నుంచి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ సహా పలువురు ప్రముఖులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ వేడుకకు అభిమానులు పోటెత్తారు.

కొందరు బారికేడ్లు పగలగొట్టుకుంటూ లోనికి చొచ్చుకున్నాడు. అరుపులు, గోలలతో రచ్చరచ్చ చేయడంతో యూనిట్ అసహనానికి గురైంది. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులను వారించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘ అందరూ కిందకు దిగుతారా? లేదా? పద్ధతిగా లేదు.. కిందకు దిగండి. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చాం.. అందరూ మన గురించి చాలా బాగా మాట్లాడుకోవాలి, అందరూ పద్ధతిగా కిందకు దిగండి అంటూ సున్నితంగా మందలించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. అటు కరణ్ జోహార్ సైతం అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ .. ఎన్టీఆర్, చరణ్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన నటన చాలా సహజంగా ఉంటుందని కితాబునిచ్చారు. అటు రామ్ చరణ్‌ని కలిసిన ప్రతిసారి అతనికి ఏదో ఒక గాయం ఉంటుందంటూ సెటైర్లు వేశారు. క్యారెక్టర్ కోసం ఆయన పడే శ్రమ అలాంటిదని... చరణ్ చాలా హార్డ్ వర్కర్ అని ప్రశంసించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందని... ఈ మూవీ రిలీజైన నాలుగు నెలల వరకు మరో సినిమాను విడుదల చేయకపోవడమే మంచిదని మేకర్స్‌కి సూచించాడు.