NTR Health University : పేరు మారిస్తే వైఎస్ స్థాయి పెరగదు.. ఎన్టీఆర్ స్థాయి తగ్గదు : హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూ. ఎన్టీఆర్
- IndiaGlitz, [Thursday,September 22 2022]
విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు వ్యవహారం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయాన్ని పార్టీలకతీతంగా ఖండిస్తున్నారు. స్వయంగా వైసీపీకే చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పేరు మార్పుపై మరోసారి ఆలోచించాలని సీఎంను కోరారు. ఇక అధికార భాషా సంఘం , హిందీ అకాడమీ ఛైర్మన్‌గా వున్న యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ... ప్రభుత్వ వైఖరికి నిరసనగా తన పదవులకు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అన్నగారి కుటుంబ సభ్యులు కూడా జగన్‌పై మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ జ్ఞాపకాలను ఎవరూ చెరిపివేయలేరు : ఎన్టీఆర్
తాజాగా ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. ఈ మేరకు గురువారం జూనియర్ ట్వీట్ చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే.. ‘‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు ’’ అంటూ జూనియర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు :
ఇకపోతే.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలసిందే. నిన్న ఉదయం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. వైద్య రంగానికి చేసిన సేవలు, చేపట్టిన సంస్కరణల కారణంగానే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రజనీ తెలిపారు. ఆపై సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను కించపరిచే ఉద్దేశం తమకు లేదని, ఎన్టీఆర్ అంటే తమకు కూడా గౌరవం వుందన్నారు. చంద్రబాబు కంటే ఎన్టీఆర్‌పై తనకే గౌరవం ఎక్కువని, అడక్కపోయినా ఎన్టీఆర్ పేరిట జిల్లాను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
— Jr NTR (@tarak9999) September 22, 2022