జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!
Send us your feedback to audioarticles@vaarta.com
జూనియర్.. జూనియర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసిన వినిపిస్తున్న.. కనిపిస్తున్న పేరు. అలాగనీ ఆయన రాజకీయాల్లో ఉన్నారా..? అంటే అస్సలు లేరు.. బహుశా రారేమో. కానీ ఆయన పేరు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. అసలు ఈ రేంజ్లో ఆయన పేరు ఎందుకు బయటికొస్తోంది..? వీటన్నింటికీ సంకేతాలేంటి..? అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎందుకింతలా జూనియర్ అని జపిస్తున్నాయ్..! ఓ వైపు రాజకీయాల్లో ఈయన హాట్ టాపిక్ అవుతుండగా.. మరోవైపు ఆయన్ను ఇన్నెన్ని మాటలు.. ఇన్నెన్ని ఆరోపణలు చేస్తుంటే ఎన్టీఆర్ ఎందుకు నోరు మెదపట్లేదు..? అనేది నెట్టింట్లో.. నందమూరి అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఇంతకీ అసలు కథేంటి..? రాజకీయ నేతలు జూనియర్ ఎందుకు చేస్తున్నారనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
జూనియర్ పాలిటిక్స్ ఇవీ..!
వాస్తవానికి 2009 ఎన్నికల్లో జూనియర్.. తన తాతగారు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడు. అచ్చుగుద్దినట్లుగా అన్నగారిలాగే డ్రెస్సింగ్ స్టైల్ మొదలుకుని మాటల తూటాలు పేల్చి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్నారు. అయితే అదేం దురదృష్టమో కానీ.. జూనియర్ ప్రచారం చేసిన నియోజకవర్గా్లన్నింటీలోనూ టీడీపీ ఓటమిపాలైంది. ఇందుకు కారణం జూనియరే అని అప్పట్లో పెద్ద పెద్ద పత్రికల్లో బ్యానర్స్ వార్తలు వచ్చాయి. అదే ఎన్నికల టైమ్‌లో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే ఎందుకిలా జరిగింది..? నాటి అధిష్టానమే ఇలా పగబట్టి మరీ చేసిందా..? అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నే. ఇలా వరుస ఘటనలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇక రాజకీయాలొద్దు బాబోయ్.. అనుకున్నాడేమో లేకుంటే నాడు తండ్రి హరికృష్ణ వద్దని చెప్పారో కానీ.. పాలిటిక్స్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉంటూ వస్తూ.. యథావిథిగా సినిమాల్లో నటించేస్తున్నారు. ఇదీ జూనియర్‌కు పాలిటిక్స్‌తో ఉన్న సంబంధం.. ఇంతకు మించీ ఏమీ లేదు.
ఎందుకు..? ఎవరు దూరం పెట్టారు!?
ఇక అసలు విషయానికొస్తే.. అసలు ఆయన్ను ఎవరు దూరం పెట్టారు..? ఎందుకు దూరం పెట్టారు..? ఎవర్ని పైకి తీసుకురావాలని.. ఎన్టీఆర్ తొక్కేసారు..? అనేది చాలా మందికి తెలియదు. కానీ జూనియర్‌కు మాత్రం చాలా హితబోధ అయ్యింది. అందుకే ఇక ఈ రాజకీయాలు చాలు అని మిన్నకుండిపోయాడు. వాస్తవానికి నాడు అన్నగారికి ఏ రేంజ్లో అభిమానులున్నారో.. కాస్త అటు ఇటూ జూనియర్‌కూ అభిమానులున్నారు. సత్తా చాటేందుకు అన్నీ ఉన్నప్పటికీ సినిమాలే తనకు సర్వస్వం అన్నట్లుగా అదే బాటలో నడుస్తున్నాడు. అయితే.. ఆయన దారిన ఆయన సినిమాలు చేసుకుంటుంటే.. ఎన్టీఆర్‌ను ఎవరు దూరం పెట్టారు..? ఎందుకు..? ఇదీ అసలు నిజాలు అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మొదలుకుని.. ఇటు కొడాలి నాని వరకు రచ్చ రచ్చచేస్తున్నారు. అన్నగారి హయాం నుంచి టీడీపీలో కార్యకర్తలుగా ఉంటూ వస్తున్న సీనియర్, జూనియర్ నేతల్లో కొందరు ఎన్టీఆర్‌కు బాగా టచ్‌లో ఉంటున్నారు. అలాంటి వారిలో ప్రస్తుత ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. వీరిద్దరూ అన్నగారి కుటుంబానికి ఆప్తులు.. ఇప్పుడూ జూనియర్‌కు మంచి ఆప్తులు. బహుశా రాజకీయంగా ఎన్టీఆర్ ఏం చేసినా వందకు వంద శాతం ఇద్దరికీ చెప్పే చేస్తాడు. నాడు టీడీపీలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మారారు. అంటే.. వైసీపీలో ఉన్నారు (వంశీ త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు).
ఇందులో నిజమెంత!?
అదేదో సామెత ఉంది కదా.. అయిపోయిన పెళ్లికి మేళాలు అన్నట్లుగా అప్పుడేదో జరిగింది..? అది అలానే ఎందుకు జరిగిందో అధినేత... ఎన్టీఆర్‌కు మాత్రమే తెలుసుకు కానీ.. వంశీ, కొడాలి మాత్రం.. మామూలుగా రచ్చ చేయట్లేదు. బహుశా వాళ్లు చెప్పేది వందకు వంద శాతం నిజమూ అయ్యిండొచ్చు. ఎందుకంటే వీళ్లిద్దరూ నాటి పరిస్థితులు దగ్గరుండి చూసినవాళ్లే కదా.!. అయితే ఇందులో నిజమెంత అనేది మాత్రం చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు తెలుసు మరి.
వంశీ ఏమంటున్నారు!?
‘2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత ఎప్పుడైనా, ఎక్కడైనా కనిపించాడా..?. కారణమేంటి..? ఎన్టీఆర్‌ను ఆపిందెవరు..? పదేళ్ల క్రితమే కెరీర్‌ను ఫణంగా పెట్టి మరీ టీడీపీ కోసం ప్రచారం చేసిన జూనియర్‌ను.. మళ్లీ పదేళ్లు ఎందుకు కనిపించలేదు..? ఎందుకు నలకపూస అయిపోయాడు..?.’ అని ప్రశ్నల వర్షం కురిపించిన వంశీ.. చివరికి ఆయనే సమాధానం సైతం చెప్పారు. నారా లోకేష్‌ను రాజకీయంగా పైకి తీసుకురావాలని ఎన్టీఆర్‌ను తొక్కేసి.. పక్కనెట్టిన మాట వాస్తవం కాదా..?.. కాదు అని చెప్పే దమ్ము మీకుందా..? అంటూ వంశీ చాలెంజ్ కూడా చేశారు.
మంత్రిగారు ఏమంటున్నారో..!?
‘జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయనే భావనతో 2009 ఎన్నికల్లో ఆయన చేత చంద్రబాబు ప్రచారం చేయించారు. అయితే కుమారుడు లోకేశ్‌కు ఎక్కడ ఇబ్బంది అవుతుందేమో..? అనే.. ఉద్దేశంతో ఆ తర్వాత ఎన్టీఆర్‌ను పక్కన పెట్టేశారు. వాస్తవానికి లోకేశ్‌ది కార్పొరేటర్ స్థాయి కూడా కాదు. కుమారుడు అయినందువల్లే లోకేశ్‌ని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవిని కట్టబెట్టారు. టీడీపీకి లోకేశ్ గుదిబండగా మారారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, చంద్రబాబులా ఆయన ఏనాడూ సొల్లు కబుర్లు చెప్పలేదు. నక్క వినయాలు ప్రదర్శిస్తూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు’ అని మంత్రి కొడాలి నాని ఆరోపించారు.
రియాక్షన్ ఉంటుందా..!?
ఇలా ఎప్పుడైతే వంశీ టీడీపీకి రాజీనామా చేసి బయటికొచ్చారో నాటి నుంచి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జూనియర్ పేరు ఇటు పేపర్లలో.. అటు చానెల్స్‌లో.. నెట్టింట్లో మార్మోగుతోంది. వంశీ.. నాని ఇద్దరూ కలిసి మున్ముంథు మరిన్ని విషయాలు మాట్లాడి.. ఎవరికీ తెలియని సీక్రెట్స్ బయటపెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదేమో.! మరి ఈ క్రమంలో ‘నా పనేదో నేను చూస్కుంటున్నా.. గతం గత: నన్ను అనవసరం గెలక్కండి’ అని ఒక్క మాట అయినా జూనియర్ చెబుతాడో లేకుంటే ఎవరేమనుకుంటే మనకేం అని మిన్నకుండిపోతాడో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments