NTR @ 25 Years : జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమాకు పాతికేళ్లు.. 13 ఏళ్ల వయసులోనే హీరోగా

  • IndiaGlitz, [Monday,April 11 2022]

అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. అచ్చుగుద్ధినట్లు తాత పోలికలతో వుండటమే కాదు.. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా ఏ అంశంలో తీసుకున్నా పెద్దాయనకు తీసిపోరని రుజువు చేసుకున్నారు. అభిమానుల చేత యంగ్ టైగర్‌గా.. పల్లె ప్రజలతో బుడ్డ రామారావుగా పిలిపించుకుంటూ స్టార్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు. ఈ యువ నటరత్నం తెలుగు ప్రజలను పలకరించి అప్పుడే పాతికేళ్లు గడిచిపోయింది.

ప‌సిప్రాయంలోనే తాత ఎన్టీఆర్ తెర‌కెక్కించిన 'బ్ర‌హ్మ‌ర్షి విశ్వామిత్ర‌' హిందీ వెర్షన్‌లో బాల భ‌ర‌తునిగా నటించి మెప్పించారు. అయితే ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ఎమ్మెస్ రెడ్డి నిర్మాణంలో.. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన 'రామాయ‌ణం' అనే చెప్పాలి. ఈ సినిమా 1997 ఏప్రిల్ 11న విడుదలైంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సహా అంద‌రూ బాల‌లే న‌టించ‌డం విశేషం. చిన్నారుల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రాజ‌మండ్రి ఊర్వ‌శి థియేటర్‌లో ఈ సినిమా నేరుగా శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకోవ‌డం విశేషం. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్త‌మ బాల‌ల చిత్రంగా అవార్డు ల‌భించింది. ఇందులో శ్రీ‌రాముని పాత్ర‌లో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. ‘‘రామాయణం’’ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 25 సంవత్సరాలు. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఎన్టీఆర్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.

దీని త‌రువాత పి.య‌న్.రామ‌చంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో 'భ‌క్త మార్కండేయ‌' అనే టీవీ సీరియ‌ల్‌లోనూ టైటిల్ రోల్ పోషించారు బుల్లి రామయ్య. ఇక వయసులోకి వచ్చిన తర్వాత 2001లో ‘‘నిన్న చూడాలని’’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం 1, సింహాద్రి.. వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ తిరుగులేని స్టార్‌లో నిలిచారు. మధ్యలో కొన్ని పరాజయాలు ఎదురైనా నిలబడ్డారు. రీసెంట్‌గా రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్‌లో కొమురం భీంగా జీవించారు.