'ఆర్ఆర్ఆర్' కోసం ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందంటే..?
- IndiaGlitz, [Friday,December 10 2021]
ట్రైలర్ లాంచ్ కావడంతో తెలుగు నాట ఆర్ఆర్ఆర్ మేనియా స్టార్ట్ అయ్యింది. సినిమా ఎలా వుండబోతోంది...? ఎన్టీఆర్- చరణ్ ఎలా చేశారోనంటూ ఇప్పటి వరకు నడిచిన డిస్కషన్ ఒక దెబ్బకు ఎగిరిపోయింది. ఇంకేముంది రాజమౌళీపై మళ్లీ ప్రశంసల వర్షం కురుస్తోంది. దానితో పాటే రికార్డులు ఇలా కొట్టేస్తాడంటూ పెద్ద చర్చ మొదలైంది. సహజంగానే రాజమౌళీ సినిమా కంప్లీట్ కావాలంటే ఏళ్లు పడుతుందన్నది బహిరంగ రహస్యం. ఆయన సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా తమ అవకాశాలను వదులుకుని పూర్తిగా జక్కన్న ప్రాజెక్ట్‌కే అంకితమవ్వాల్సి వుంటుంది.
అయినప్పటికీ అవేవి పట్టించుకోకుండా రాజమౌళీతో వర్క్ చేయడానికి నటీనటులు ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు. ఎందుకంటే ఆ మూవీతో వచ్చే క్రేజ్, పాపులారిటీ మామూలుగా వుండదు. సింహాద్రి నుంచి బాహుబలి వరకు ఆయనతో పనిచేసిన వారు చెప్పిన మాట ఇదే. బాహుబలి రెండు భాగాల కోసం ప్రభాస్ ఐదేళ్ల సమయం కేటాయించారు. ఆ సమయంలో ప్రభాస్ మరే ఇతర చిత్రానికి ఒప్పుకోలేదు. అందుకు ఫలితమే ఇప్పటి పాన్ ఇండియా స్టార్ ముద్ర. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం రాంచరణ్, ఎన్టీఆర్ కూడా అంతే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇద్దరు హీరోలు తమ తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.. రిలీజ్ డేట్‌కు సమయం దగ్గరపడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది. దీనిలో భాగంగా గురువారం ముంబైలో ఆర్ఆర్ఆర్ ప్రెస్‌మీట్ జరిగింది. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవ్ గన్, డివివి దానయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణకు దాదాపు మూడేళ్ళ సమయం పట్టింది. ఈ మూడేళ్ళలో మీరు ఎన్ని చిత్రాలు వదులుకున్నారు అని ఎన్టీఆర్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ.. ఈ మూడేళ్ళలో నేను ఆర్ఆర్ఆర్ పైనే ఫోకస్ పెట్టానని.. మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేదని, అయినా రాజమౌళితో సినిమా చేస్తుంటే నాకు ఇంకెవరు ఆఫర్ ఇస్తారు అని కౌంటరిచ్చారు ఎన్టీఆర్. దీంతో అక్కడున్న వారందరిలో నవ్వులు విరిశాయి.