ఆడపడుచులపై దూషణలు.. అరాచక పాలనకు నాందీ : ఏపీ అసెంబ్లీ ఘటనపై ఎన్టీఆర్ ఎమోషనల్
- IndiaGlitz, [Saturday,November 20 2021]
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం సభలో జరిగిన పరిణామాలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తనను, తన భార్యను ఉద్దేశిస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సీఎం అయిన తర్వాతే సభలోకి అడుగుపెడతానని ఆయన శపథం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ వెంటనే టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం నందమూరి కుటుంబం సైతం వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో సినీనటుడు, జూనియర్ ఎన్టీఆర్ సైతం అసెంబ్లీ ఘటనపై స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని... కానీ ఆ విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలని ఆయన హితవు పలికారు. అయితే వ్యక్తిగత దూషణలు, విమర్శలు తగదని ఎన్టీఆర్ సూచించారు. అసెంబ్లీలో నిన్న జరిగిన ఘటన తన మనసును కలిచివేసిందని... ఎప్పుడయితే మనం ప్రజా సమస్యలు పక్కన పెట్టి మన ఆడ పడుచులపై పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో అది అరాచక పాలనకు నాంది పలుకుతునట్లని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు.
స్త్రీలను గౌరవించడం అనేది... మన నవనాడుల్లో, రక్తంలో ఇమిడిపోయే సంప్రదాయమని ఎన్టీఆర్ అన్నారు. కానీ మన సంస్కృతి కాల్చివేసి భావితరాలకు బంగారు బాట వేస్తున్నామనుకుంటే అది పొరపాటేనని ఆయన హెచ్చరించారు. ఈ మాటలు వ్యక్తిగత దూషణలకు గురైన ఓ కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదని... ఓ కొడుకుగా, ఓ భర్తగా, తండ్రిగా, ఓ భారతీయ పౌరుడిగా మాట్లాడుతున్నానన్నారు. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవడిక ఉండేలా జాగ్రత్త పడాలని ఎన్టీఆర్ హితవు పలికారు. ఇది ఇక్కడితో ఆగిపోతుందని యంగ్‌టైగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
— Jr NTR (@tarak9999) November 20, 2021