జగన్‌‌ను గెలిపించేందుకు వైసీపీలో చేరా: ఎన్టీఆర్ మామ

  • IndiaGlitz, [Thursday,February 28 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నేతల జంపింగ్‌‌లు షురూ అవుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షపార్టీల్లోకి పలువురు నేతలు చేరగా.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి తారకరామారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌ను మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈయన ఏపీ సీఎం చంద్రబాబుకు చాలా దగ్గరి బంధువు. ఈయన చేరికతో టీడీపీకి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు. నార్నే శ్రీనివాసరావు చేరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

కండువా కప్పుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన నార్నె.. జగన్‌ను ఖచ్చితంగా గెలిపించేందుకు వైసీపీలో చేరానని చెప్పారు. రాష్ట్రానికి వైఎస్‌ జగన్‌ నాయకత్వం అవసరమన్నారు. పదేళ్లుగా జగన్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. వైసీపీలో చేరడానికి.. జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా నార్నె స్పష్టం చేశారు. తాను ఏ సీటూ ఆశించి వైసీపీ కండువా కప్పుకోలేదని.. జగన్‌‌ను సీఎంగా చూడాలని పార్టీలో చేరానన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

వైసీపీ కండువా కప్పుకున్న కిల్లి..

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు కిల్లి కృపారాణి వైసీపీలో చేరారు. ఇటీవల ఆమె కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్‌ జగన్‌తో కిల్లి భేటీ అయిన విషయం విదితమే. గురువారం ఉదయం జగన్‌ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కిల్లికి.. వైసీపీ కండువా కప్పిన జగన్‌ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. జగన్‌తోనే రాజన్న రాజ్యం వస్తుందని కృపారాణి పేర్కొన్నారు.