Jr NTR: నా గుండె తరుక్కుపోతోంది.. జపాన్ ప్రజలు ధైర్యంగా ఉండండి..

  • IndiaGlitz, [Tuesday,January 02 2024]

కొత్త ఏడాది జపాన్ దేశం ప్రజల్లో భయంకరమైన అలజడి తీసుకొచ్చింది. వరుస భూకంపాలు, సునామీ హెచ్చరికలతో ప్రజలు చిగురుటాకులా వణికిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎందుకంటే న్యూ ఇయర్ వెకేషన్‌ కోసం భార్య ప్రణీత, పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి తారక్ జపాన్ వెళ్లారు. దీంతో భూకంపాలు జపాన్‌ను వణికిస్తున్నాయని తెలుసుకున్న ఫ్యాన్స్ ఆయన ఎలా ఉన్నారో.. ఎక్కడ ఉన్నారో అని టెన్షన్ పడ్డారు.

అయితే ఎన్టీఆర్ ఫ్యామిలీ సోమవారం సాయంత్రం సురక్షితంగా హైదరాబాద్ చేరుకుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎన్టీఆర్ బయటకు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా జపాన్ ప్రజలకు ధైర్యం చెబుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. జపాన్ నుంచి ఇప్పుడే ఇంటికి వచ్చాను. అక్కడ భూకంపం గురించి తెలిసి షాక్ అయ్యాను. గత వారం అంతా జపాన్‌లోనే ఉన్నాను. భూకంపం బారిన పడిన ప్రజల గురించి ఆలోచిస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. జపాన్ ప్రజలు ధైర్యంగా ఉండండి అని భరోసా నింపారు.

ఇదిలా ఉంటే RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తారక్ ప్రస్తుతం 'దేవర' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నూతన సంవత్సరం కానుకగా సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్.. బ్లాక్ డ్రెస్‌లో టక్ చేసుకుని పడవలో నిలబడి సీరియస్‌ లుక్‌లో ఉన్నారు. జనవరి 8న మూవీ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా, శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తొలిసారిగా ఎన్టీఆర్ సరసన నటిస్తుండడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా 'దేవర' పార్ట్-1 విడుదల కానుంది.