ఎమ్మెల్సీ బరిలో జర్నలిస్టులు..
- IndiaGlitz, [Monday,October 05 2020]
జర్నలిస్టులు రాజకీయరంగ ప్రవేశం చేయడమనేది కొత్తేమీ కాదు... కానీ ఎమ్మెల్సీ బరిలో ఈ స్థాయిలో పోటీ చేయడమే ఇప్పటి వరకూ జరిగి ఉండకపోవచ్చు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ బరిలో ఈసారి జర్నలిస్టులు పోటీలో దిగుతున్నారు. ఏ ఏ జర్నలిస్టులు ఎమ్మెల్సీ బరిలో ఉన్నారో.. వారు ఏఏ సంస్థల్లో పని చేశారనే దానిపై ఓ లుక్కేద్దాం.
రాణి రుద్రమ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాణి రుద్రమ పోటీ చేస్తున్నారు. ఆమె టీవీ9, సాక్షి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీ న్యూస్, హెచ్‌ఎం టీవీ వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పని చేశారు. అలాగే దశ దిశ వంటి ప్రోగ్రాంలకు సమన్వయ కర్తగా, ప్రయోక్తగా వ్యవరించారు. దీంతో రాణి రుద్రమకు మంచి గుర్తింపే ఉంది. ప్రస్తుతం ఆమె యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు.
జయ సారధి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ జర్నలిస్ట్‌గా జయసారధి పని చేస్తున్నారు. జయ సారధి రాజకీయ అరంగేట్రం చేస్తున్నట్టు ప్రకటించారు. సీపీఐ మద్దతుతో ఎమ్మెల్సీ పోటీలో దిగనున్నట్టు సహచరులతో తెలిపారు. మొదట కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుందనే విశ్వాసం ఉన్నప్పటికీ వారి నిర్ణయం కోసం ఎదురు చూడకుండా తాను రంగంలోకి దిగుతున్నట్టు జయసారధి ప్రకటించారు.
పీవీ శ్రీనివాస్: పీవీ శ్రీనివాస్ టీ న్యూస్ ఇన్‌పుట్ ఎడిటర్‌గా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారు. గతంలో టీవీ9లో పని చేసిన అనుభవం ఉంది. విద్యార్థి ఉద్యమాల్లో శ్రీనివాస్ పని చేశారు. దీంతో పాటు ఖమ్మం జిల్లాలో ఓ వామపక్ష పార్టీతో సన్నిహిత సంబంధాలు, ప్రజా సంఘాలతో అనుబంధం కలిసి వస్తుందనే విశ్వాసంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి తాను కూడా అర్హుణ్ణే అని ఆత్మీయుల సమ్మేళనంలో ప్రకటించారు. అయితే శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించాల్సి ఉంది. ఖరారయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి.
తీన్మార్ మల్లన్న: తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ స్థానంలో రంగంలో తిరుగుతున్నట్టు గత కొంత కాలంగా చెబుతూనే ఉన్నారు. తీన్మార్ మల్లన్న గతంలో వీ6 ఛానల్‌లో పనిచేసి తర్వాత 10 టీవీకి మారారు. ఇప్పుడు టీవీ ఫైవ్‌లో స్లాట్‌కు పని చేస్తున్నారు. మల్లన్న సొంతంగా క్యూ న్యూస్ ఛానల్ నడిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిత్యం ప్రజల్లో ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రస్తుతానికి ఏ అభ్యర్థినీ ప్రకటించలేదు. మరోవైపు కోడూరు మానవతారాయ్ మాత్రం తాను ఎమ్మెల్సీ బరిలో ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ఇక తెలంగాణ జన సమితి నుంచి కోదండరామ్ తానే బరిలోకి దిగుతారని తెలుస్తోంది. మరి తనే బరిలోక దిగుతారో మరెవరికైనా మద్దతు పలుకుతారో చూడాలి. ఏదేమైనప్పటికీ ఈసారి జర్నలిస్టులు ఎమ్మెల్సీ ఎన్నికల రంగంలోకి దిగటం కొంత ఆశాజనకమైన పరిణామం. అయినప్పటికీ పట్టభద్రులు ఎటు మొగ్గుచూపుతారు అనే విషయం వేచి చూడాల్సిందే. ఇందులో కొన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు కూడా లేకపోలదు.