Jonnavithula:ఏపీలో కొత్త రాజకీయ పార్టీ .. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల సంచలన నిర్ణయం, జెండా ఇదే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
మరికొద్దినెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలని వైసీపీ.. ఈసారి గెలిచి సత్తా చాటాలని టీడీపీ , కింగ్ మేకర్‌గా మారాలని జనసేన, తమకూ కాస్త స్పేస్ ఇవ్వాలని బీజేపీలు స్కెచ్ గీస్తున్నాయి. ప్రధాన పార్టీల నేతలంతా ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో మరో మరో రాజకీయ పార్టీ పుట్టుకురానుంది. అది కూడా చిత్ర పరిశ్రమకే చెందిన వ్యక్తి సారథ్యంలోనే.
తెలుగు భాష పరిరక్షణే ధ్యేయం :
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు తాను పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం ‘‘జై తెలుగు’’ పేరుతో పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తెలుగు భాషకు పునర్వైభవం తీసుకురావాలన్నదే తన సంకల్పమని జొన్నవిత్తుల స్పష్టం చేశారు. తెలుగు భాష పరిరక్షణ అజెండాతోనే వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని రామలింగేశ్వరరావు వెల్లడించారు.
జెండాలో ఐదు రంగులు.. ఐదుగురు మహనీయులు :
ఆగస్ట్ 15 నాటికి తన పార్టీ విధివిధానాలు ప్రకటిస్తానని.. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని రూపొందించానని జొన్నవిత్తుల పేర్కొన్నారు. ఇందులో నీలం రంగు .. జలానికి, పచ్చ రంగు.. వ్యవసాయానికి, ఎరుపు.. శ్రమ శక్తికి, పసుపు.. వైభవానికి, తెలుపు.. స్వచ్ఛతకు చిహ్నంగా రూపొందించినట్లు జొన్నవిత్తుల వెల్లడించారు. తెలుగు భాష కోసం ఎంతో కృషి చేసిన మహనీయులు గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ చిత్రాలు తన జెండాలో వుంటాయని ఆయన తెలిపారు. మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకున్నామని.. తెలుగు భాష ఒక్కటేనని, కానీ ఏపీలో మాత్రం ప్రాంతాలవారీగా విడిపోయిందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments