ఎప్పుడైతే డిజిటల్ మాధ్యమాలకు ఆదరణ పెరుగుతుందో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలకు ఆదరణ పెరుగుతుంది. కొత్త దర్శకులు వైవిధ్యమైన కాన్సెప్టులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం విడుదలైన చిత్రం జోహార్. పొలిటికల్ సెటైర్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ ఉద్దానం సమస్యతో కొన్ని పొలిటికల్ అంశాలను టచ్ చేస్తుందని ట్రైలర్ ద్వారా చిత్ర యూనిట్ రివీల్ చేసింది. విగ్రహ రాజకీయాలు.. దాని చుట్టూ ఉన్న సమస్యలు, కొన్ని పాత్రలు అన్నింటి కలయికగా జోహార్ సినిమాను తెరకెక్కించారు.
కథ:
ముఖ్యమంత్రి అచ్యుత రామయ్య (చలపతిరావు) చనిపోవడంతో ఆయన స్థానంలోకిఆయన వారసుడు, సీఎం విజయ్ వర్మ(చైతన్యకృష్ణ) వస్తాడు. అధిష్టానంకు తన తండ్రి గొప్పతనం తెలిసేలా, తండ్రి పేరు నిలిచిపోయేలా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటాడు. దానికి బాగా డబ్బులు అవసరం అవుతాయి. అందుకని కొన్ని సంక్షేమ పథకాలు పెట్టి, అందులో కొన్ని నిధులను మళ్లించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటాడు విజయ్ వర్మ. అలా చేసే క్రమంలో ప్రభుత్వం నుండి అందాల్సిన నిధులు సకాలంలో నిధులు అందకుండా.. నలుగురి జీవితాలపై ప్రభావం చూపుతుంది. విగ్రహ ప్రతిష్ట వల్ల ప్రజలకు జరిగే లాభనష్టాలేంటి? రోడ్డు మీద సర్కస్ చేసే బాల(నైనా గంగూలీ) పరుగు పందెంలో పాల్గొనాలని కలలు కంటుంది. మరో వైపు బోస్(శుభలేక సుధాకర్) తన హాస్టల్‌లో ఉండే పిల్లలకు సరైన వసతి కల్పించాలని అనుకుని ప్రభుత్వ నిధుల కోసం తిరుగుతుంటాడు బోస్. అలాగే ఉద్దానంలోని ఉండే గంగమ్మ(ఈశ్వరీరావు) అక్కడ ఉండే తాగునీటి సమస్య కారణంగా కిడ్నీ సమస్యతో భర్తను పొగొట్టుకుంటుంది. అదే సమస్య తన కుమార్తెకు కూడా వస్తుంది. అందుకని కొద్ది పొలాన్ని కౌలుకిచ్చి ఆ డబ్బుతో కుమార్తెకు వైద్యం చేయించాలనుకుంటూ ఉంటుంది. వారణాసిలో ఉండే తెలుగు కుర్రాడు(అంకిత్ కొయ్య) , వేశ్య కూతురు జ్యోతి(ఎస్తర్ అనిల్)ను ప్రేమిస్తాడు. ఇద్దరూ వారణాసి నుండి పారిపోయి వారణాసి చేరుకుంటారు.
మరి ఈ అందరి జీవితాలు ఒకరికొకరితో ఎలా ముడిపడ్డాయి? అందరూ ఎదుర్కొనే సమస్యలు ఏంటి? చివరకు సమస్యలు ఎలా తీరుతాయి? అనే విషయాలు తెలియాలంటే ఆహాలో ‘జోహార్’ సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
యాంథాలజీ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. అలాంటి చిత్రాల స్టైల్లో రూపొందిన చిత్రమే జోహార్. పొలిటికల్ సెటైరిక్‌గా ఐదుగురు జీవితాల చుట్టూ నడిచే చిత్రమిది. ఈ ఐదుగురు వ్యక్తుల జీవితాలు ఒకరికొకరికి సంబంధం ఉండదు. కానీ.. ఓ వ్యక్తి తీసుకునే అనాలోచిత నిర్ణయం అందరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనేదే జోహార్ చిత్రం. పదవి, పవర్ అనేది అలంకారమే కాదు.. బాధ్యత కూడా. అలాంటి పదవిలో ఉండే వ్యక్తలు ప్రజలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలనే పాయింట్.. ఎక్కడో చేసే పని మరెక్కడో ప్రభావం చూపిస్తుంది. అని ఓ రకంగా కాస్మిక్ లా అనే స్టైల్ ఆఫ్ థీమ్‌తో సినిమా తెరకెక్కింది. దర్శకుడు తేజ మార్ని ఉపకథలను కలిపి సినిమాగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. ఈ మధ్య జరిగిన కొన్ని సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టిన చిత్రమిది.
నటీనటుల పరంగా చూస్తే శుభలేఖ సుధాకర్, ఈశ్వరీరావు, నైనా గంగూలీ, అంకిత్, ఎస్తర్, చైతన్యకృష్ణ ఇలా అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమాచూసే సమయంలో మనకు పాత్రలే కనపడతాయి. టెక్నికల్‌గా చూస్తే దర్శకుడు తేజ మార్ని తక్కువ బడ్జెట్‌లో చక్కటి ప్రయత్నమే చేశాడనిపించింది. సినిమా కూడా ఓకే అనిపిస్తుంది. సమకాలీన రాజకీయాలపై పంచ్‌లు, దేవుడు, డబ్బులు ఇలాంటి విషయాలపై పంచ్‌లు బాగానే పడ్డాయి. కథలో అంతర్లీనంగా పాటలు ఉన్నాయి. అయితే స్లో నెరేషన్‌గా అనిపిస్తుంది. ఇంకాస్త ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకుని ఉండుంటే బాగుండేదనిపించింది.
చివరగా.. జోహార్.. మంచి ప్రయత్నమే అయినా స్లో నెరేషన్
Comments