అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం
Send us your feedback to audioarticles@vaarta.com
అగ్రరాజ్యం అమెరికా మరో నవ శకానికి నాందిగా మారింది. సెంట్ మాథ్యూ చర్చ్‌లో ప్రార్థనల అనంతరం.. దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10- 30 గంటలకు.. అమెరికా అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు. బైబిల్ పుస్తకంపై చేయి ఉంచి మరీ జోబైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన వారిలో అతి పెద్ద వయస్కుడు జో బైడెనే కావడం విశేషం. ఆయనకు 78 ఏళ్లు. ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ మాత్రం హాజరు కాలేదు. జో బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం దాదాపు 25 వేల మంది నేషనల్ గార్డ్స్ పహరా కాశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అమెరికా విమానాలు ఆకాశం నుంచి భద్రతను ఏర్పాట్లను పర్యవేక్షించాయి.
ఇటీవలి అమెరికన్ చరిత్రలో అతి నిరాడంబరంగా..
చాలా తక్కువ మంది ఆహ్వానితుల మధ్య ఈ కార్యక్రమం చాలా నిరాడంబరంగా జరిగింది. ఇటీవలి అమెరికన్ చరిత్రలో ఇది అతి నిరాడంబరంగా, సాదాసీదాగా జరిగిన కార్యక్రమమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ.. ఈరోజు అమెరికాలో ప్రజాస్వామ్యం గెలిచిన రోజని.. అధ్యక్షుడిగా దేశ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని, అమెరికాను పరిరక్షిస్తానన్నారు. మీకు ఇవ్వగలిగిందంతా ఇస్తానని... చేయగలిగిందంతా చేస్తానన్నారు. అధికారం గురించి కాదు, అవకాశాల గురించి పాటుపడతానని జో బైడెన్ వెల్లడించారు. వ్యక్తిగత లాభం కోసం కాదు, ప్రజా క్షేమానికి కృషి చేస్తానని.. మనమంతా కలిసి ఓ కొత్త చరిత్రను లిఖిద్దామన్నారు. తనను నమ్మాలని... ఎప్పుడూ మీకు నిజమే చెబుతానని.. నిజాయితీగా ఉంటానని జో బైడెన్ వెల్లడించారు.
బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు...
బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు దేశ 49వ ఉపాధ్యక్షురాలిగా, అలాగే దేశ తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ (56) ప్రమాణ స్వీకారం చేశారు. అంతే కాకుండా ఈ పదవి చేపట్టిన తొలి ఆఫ్రికన్-ఆమెరికన్‌గా, దక్షిణాసియా మూలాలున్న వ్యక్తిగా, భారతీయ మూలాలున్న వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. కమలా హారిస్ కూడా బైబిల్ సాక్షిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కమలా హారిస్.. దేశాన్ని, రాజ్యాంగాన్ని అంతర్గత విదేశీ శత్రువుల నుంచి పరిరక్షిస్తానని, సత్య నిష్టతో బాధ్యతలు నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం దేశ ప్రజల సేవకు సిద్ధమని... ప్రజల కోసం... నిరంతరం.. సేవ చేస్తుంటానని కమలా హారిస్ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments