యువతరం హీరోల్లో డ్యాన్సులు, ఫైట్లు చేసి కాస్త బేస్ వాయిస్‌తో మాట్లాడగల వ్యక్తి ఆది సాయికుమార్. ఇటీవల ఆయన నటించిన `బుర్రకథ` బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. అంతకుముందు కూడా ఆయన సోలో హీరోగా నటించగా, ఆడిన సినిమాలు పెద్దగా ఏవీ లేవు. ఈసారి ఎలాగైనా ఆయన హిట్ కొట్టి తీరాలని అనుకున్నారు. అందుకే మధ్యే మార్గంగా లవ్, ఫ్యామిలీ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నారు. `జోడీ` అని పేరు పెట్టుకున్నారు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ నాయిక. `జెర్సీ`తో సూపర్ హిట్ కొట్టిన ఆ అమ్మాయి ఆ సినిమాకన్నా ముందు చేసిన సినిమా ఇది. అయితే దాని తర్వాత విడుదలవుతోంది. ద్వితీయవిఘ్నాన్ని ఆ అమ్మాయి తెలుగులో దాటుతుందో లేదో చూడాలి. ఆది హిట్ వస్తుందో లేదో చూడాలి మరి.
కథ:
కమలాకర్ (నరేష్)కి క్రికెట్ అంటే పిచ్చి. టీవీలో క్రికెట్ చూస్తూ బెట్టింగులు తెగ కడుతుంటాడు. తన జీతం, ఆస్తి, భార్య ఒంటి మీద నగలు, ఆఖరికి కొడుకు జీతం కూడా పెట్టి బెట్టింగులు కాసే రకం అన్నమాట.కొడుక్కి కపిల్ అని పేరు పెట్టుకుంటాడు. ఒకానొక సందర్భంలో స్నేహితుడు చల్లా శ్రీనివాసరావు (కేదార్‌నాథ్) చేతకూడా బెట్టింగులు కట్టిస్తాడు. బెట్టింగుల వల్ల అప్పులపాలైన శ్రీనివాసరావు ఉరేసుకుంటాడు. అతని కుమార్తె (కాంచనమాల)ను తమ్ముడు (సిజ్జు)చూసుకుంటుంటాడు. ఒకానొక సమయంలో కపిల్‌కి, కాంచనమాలకు పరిచయం ఏర్పడుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. జీవితంలో కొన్ని ప్రిన్సిపల్స్ ను ఫాలో అయ్యే అమ్మాయి కాంచన. తనలాంటి అలవాట్లే ఉన్న కపిల్‌ను తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలని పిన్ని (సితార)తో చెబుతుంది. పిన్ని అంగీకారంతో ఆమె బాబాయ్ కూడా కపిల్‌ను కలవడానికి అంగీకరిస్తాడు. అక్కడ అతనికి కమలాకర్ కనిపిస్తాడు. ఆ కమలాకర్ పరిస్థితి గురించి సిజ్జుకు ముందే తెలుసు. అందుకే కాదంటాడు. అలా ఖరాకండిగా కాదన్న సిజ్జును కపిల్ ఎలా ఒప్పించాడు? కమలాకర్ ప్రవర్తన మారిందా? శ్రీనివాసరావు తండ్రి కమలాకర్‌కి చేసిన ఉపదేశం ఏంటి? మధ్యలో కాంచనమాలను పెళ్లి చేసుకుంటానని వచ్చిన వ్యక్తి ఎవరు? అతనికీ, కపిల్‌కీ ఉన్న గొడవలేంటి? అతని గర్ల్ ఫ్రెండ్ కీ, కపిల్‌కీ చిన్నతనంలో ఉన్న పరిచయం ఎలాంటిది వంటివన్నీ సెకండాఫ్‌లోనూ, క్లైమాక్స్ లోనూ తెలిసే అంశాలు.
ప్లస్ పాయింట్లు:
పాటలు బావున్నాయి. మైసూర్ వీధులను చాన్నాళ్ల తర్వాత తెలుగు సినిమాలో చూపించారు. జూదం ఆడిన వాడి చుట్టూ ఉన్నవాళ్లందరూ పోతారని క్లైమాక్స్ లో గొల్లపూడి మారుతీరావు చెప్పే డైలాగులు బావున్నాయి. సితార - సిజ్జు జంట తెరమీద ఆకట్టుకుంది. సిజ్జు పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా బావుంది. సత్య, వెన్నెలకిశోర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
ఆది డ్యాన్సులు ఈజ్‌తో చేశాడు. శ్రద్ధ శ్రీనాథ్ ని రెగ్యులర్ టీచర్‌గా కాకుండా, ఫారిన్ లాంగ్వేజ్ టీచ్ చేసే టీచర్ గా చూపించడం కొత్తగా ఉంది. అక్కడక్కడా డైలాగులు, వినడానికి పాటలూ బావున్నాయి.
మైనస్ పాయింట్లు:
శ్రద్ధా శ్రీనాథ్ నటించిన `జెర్సీ`తో పోలిస్తే ఈ సినిమాలో ఆమె నటించడానికి అసలు స్కోపే లేదు. నరేష్ దంపతుల మధ్య వచ్చే చాలా సన్నివేశాలు కృతకంగా అనిపిస్తాయి. సినిమాలో కూడా ఎన్నో సీన్లు ఆల్రెడీ ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసినవే ఉంటాయి. ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండవు. ఫ్లాట్ నెరేషన్ ఉంటుంది. ఎక్కడా ప్రేక్షకుడు ఎగ్జయిట్ ఫీల్ కాడు. సన్నివేశాల్లో లోపించిన నవ్యత్వం వల్ల నిడివి ఎక్కువైపోయిందనే భావన కలుగుతుంది. ఎడిటర్ కూడా తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సిందే. సన్నివేశబలం లేకపోవడంతో నేపథ్య సంగీతం కూడా పేలవంగా అనిపించింది. పాటలను కావాలని బలవంతంగా చొప్పించినట్టు వస్తాయి.
విశ్లేషణ:
అసలే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో ఎంపిక చేసుకోవాల్సిన కథ ఇది మాత్రం కాదు. కథగా, లైన్‌గా బాగానే ఉన్నప్పటికీ దర్శకుడు తెరమీద ఎమోషన్స్ పండించడానికి విఫలమయ్యాడు. మంచి నటీనటులను ఎంపిక చేసుకున్నప్పటికీ, దానివల్ల ఫలితం లేకపోయింది. వాన పాటలో అంత వర్షం కురుస్తున్నట్టు చూపించి, హీరో హీరోయిన్లు మాత్రం తడవరు. పైగా బలమైన ఎమోషన్స్ అసలు ఉండవు. ప్రేమ కూడా తేలిగ్గా పుట్టేస్తుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలేసి కాబోయే చినమావను ఇంప్రెస్ చేయడానికి హీరో రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరడం, ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ లు వెకిలిగా అనిపిస్తాయి. వెతుకుతూపోతే, చెబుతూ పోతే ఇలాంటి లోపాలు చాలానే ఉంటాయి. శ్రద్ధ శ్రీనాథ్ ఈ చిత్రంతో తెలుగులో ద్వితీయ విఘ్నాన్ని దాటలేకపోయింది. కాకపోతే జూదం ఆడటం వల్ల వచ్చే ఇబ్బందులను చెప్పడం మాత్రం బావుంది. మంచి సందేశాన్ని ఇచ్చారు. కాకపోతే అది ఎంతమందికి రీచ్ అవుతుందనేది ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి కథలు తీసుకున్నప్పుడు దర్శకుడు సన్నివేశాలను గ్రిప్‌గా రాసుకుని ఉంటే బావుండేది.
బాటమ్ లైన్: ఆద్యంతం బోరింగ్ `జోడీ`
Comments