జిగేల్ భామ... ఇప్పుడు శ్రీదేవి!
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు జళ్లతో, ఒంటి మీద ఓణీతో, మంచి నిండైన పరికిణీతో, పొడవాటి అమ్మాయి కంటి నిండా కాటుక పెట్టి, జళ్లో పువ్వులు పెట్టి, అమాయకంగా చూపులు పెట్టి, సైకిల్ ఎక్కి తొక్కుతుంటే... సైకిల్ ముందుకు కదులుతుందో లేదోగానీ, కుర్రకారు గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడతాయి. ఆ స్పీడ్‌ను క్యాచ్ చేయాలని, క్యాష్ చేయాలని హరీశ్ శంకర్ భావించినట్టున్నారు. అందుకే `జిల్ జిల్ జిల్ జిల్ జిగేలు రాజా... ` అంటూ మాస్ గుండెల్లో బెర్త్ వేసుకున్న పూజా హెగ్డేను ఈ సారి `శ్రీదేవి` అని పిలుచుకునేలా చేశారు. అవును.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం `వాల్మీకి`.
ఈ సినిమాలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె పేరు శ్రీదేవి. గ్రామీణ యువతిగా కనిపించనుంది. ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతోంది. ``మా మనసుల్లోంచి మీకోసం వచ్చిన శ్రీదేవి..` అని ఈ స్టిల్ గురించి పూజా హెగ్డే ఇన్ స్టాలోనూ పోస్ట్ చేసింది.
వరుణ్‌తేజ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న సినిమా ఇది. అధర్వా మురళి ఇందులో కీలక పాత్ర పోషించారు. తెలుగులో ఈ చిత్రానికి 14 రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆచంట రామ్, ఆచంట గోపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆ మధ్య రాయలసీమ జిల్లాల్లోనూ ఈ సినిమా షూటింగ్ జరిగింది. మిక్కీ.జె.మేయర్ స్వరసారథ్యంలో ఈ మధ్య విడుదల చేసి పాట గిర్ర గిర్ర.. మాస్‌ను ఊపేస్తోంది. అయాంకా బోస్ ఈ సినిమాకు కెమెరామేన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా తమిళ చిత్రం జిగర్తాండాకు అఫిషియల్ రీమేక్‌గా రూపొందిస్తున్నారు. అయితే వాల్మీకి అని పేరు పెట్టడంలో ఆ సామాజిక వర్గంగ గొడవ కూడా చేసిన సంగతి తెలిసిందే. అయినా సినిమాలో ఆ పేరుకు, ఆ వర్గానికి ఎలాంటి సంబంధం ఉండదని ఇప్పటికే చిత్ర యూనిట్ తేల్చేసింది.
ఈ సినిమా పూర్తిగా క్రైమ్ కామెడీగా రూపొందనుంది. `సాహో` విడుదలై, ఆ సందడి కాస్త తగ్గాక సెప్టెంబర్ 13న విడుదల కానుంది. మాస్, కమర్షియల్ చిత్రాలను బాగా తీస్తాడనే పేరున్న హరీష్ శంకర్ `డీజే దువ్వాడ జగన్నాథమ్` తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. వరుణ్‌తేజ్ లుక్స్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments