కొన్ని సినిమాల మీద ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. అలాంటివాటిలో స్పోర్ట్స్ డ్రామాలు ఎప్పుడూ ముందుంటాయి. విన్నరో, లూసరో... హీరో ఎవరైనా కావచ్చు. కానీ తెరమీద పంచే స్ఫూర్తిని ఆడియన్స్ ఫీల్ అయితే తప్పకుండా సినిమా సక్సెస్ అయినట్టు. `జెర్సీ` టీజర్ , ట్రైలర్‌లో ఆ విషయాలు పుష్కలంగా కనిపించాయి. దానికి తోడు నాని ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం, `తప్పక హిట్ కొడుతున్నాం` అని చెప్పిన మాటలు సినిమాపై మరింత కాన్‌సెన్‌ట్రేషన్‌ను పెంచాయి. దర్శకుడు తిన్ననూరి `మళ్లీ రావా` డీసెంట్ హిట్ అయింది. మరి ఈ సినిమాను ఎలా తీశాడు? ఎమోషన్స్ ని ఎలా పండించాడు... చదివేయండి.
కథ:
రంజీ ట్రోఫీకి ఆడిన బెస్ట ప్లేయర్ అర్జున్ (నాని). అతన్ని ఇండియన్ టీమ్‌కి సెలక్ట్ చేయరు. డబ్బులు, సిఫారసులు ఇలా ఎన్నో ఆ సెలక్ట్ చేయకపోవడానికి కారణమవుతాయి. 26 ఏళ్ల అర్జున్ వెంటనే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి చేరుతాడు. అంతకు ముందే తనను ప్రేమించిన సారా (శ్రద్ధా శ్రీనాథ్)ను పెళ్లి చేసుకుంటాడు. సారా తల్లిదండ్రులు ఈ పెళ్లిని అంగీకరించకపోవడంతో ఇద్దరూ రిజిస్టర్ ఆఫీస్‌లో పెళ్లి చేసుకుంటారు. వీరి పెళ్లికి అసిస్టెంట్ కోచ్ (సత్యరాజ్) పెళ్లి పెద్దగా వ్యవహరిస్తారు. అర్జున్, సారా జీవితం హాయిగా సాగిపోతున్నందుకు సాక్షిగా వారికి కొడుకు పుడతాడు. అతనికి నాని అని పేరు పెట్టుకుని, అతనికి క్రికెట్ నేర్పిస్తుంటారు. ఇంతలో అర్జున్‌కి ఉద్యోగం పోతుంది. కోర్టులోఉద్యోగానికి సంబంధించి వ్యవహారం నడుస్తుంటుంది. ఆ కేసు విన్ కావాలంటే ఏం చేయాలి? అంతలో తన కుమారుడు కోరిన కోరికను తీర్చలేక సతమతమవుతాడు. ఆ సందర్భంలో అతను తీసుకున్న నిర్ణయం ఏంటి? 26 ఏళ్లప్పుడు క్రికెట్ బ్యాట్‌ను పక్కన పడేసిన అతను మళ్లీ ఎందుకు బ్యాట్ పట్టుకున్నాడు? ఏం చేశాడు? ఆఖరికి ఏమైంది వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.
ప్లస్ పాయింట్లు:
నానికి మిడిల్ క్లాస్ కేరక్టర్లు చేయడం కొత్తకాదు కానీ, అర్జున్ పాత్ర మాత్రం కొత్తే. కోరి చేసుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే, ఆమె సంపాదనపై బతికే భర్తగా నాని చాలా మంచి నటన చూపించాడు. దానికి తోడు కొడుకు కోరిక తీర్చలేక అతను సతమతమయ్యే తీరు, భార్యను మరింత గొప్పగా అర్థం చేసుకునే విధానం, రోప్‌లో మాత్రమే తాను బతకగలనని నిరూపించుకున్న విధానం, అన్నిటికీ మించి అతను క్రికెట్ ఆడిన తీరు ప్రతిదీ బావుంది. గర్ల్ ఫ్రెండ్‌గా, హౌస్‌వైఫ్‌గా, మదర్‌గా, ఆఖరిన తాను చేసిన పొరపాటును తెలుసుకుని కుమిలిపోయే స్త్రీగా... శ్రద్ధ తన బెస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చింది. అనిరుద్ ఇచ్చిన ట్యూన్లు గొప్పగా ఉన్నాయని చెప్పలేం కానీ, సన్నివేశాలతో సమానంగా సాగిపోయాయి.కానీ రీరికార్డింగ్ మాత్రం మరో స్థాయిలో ఉంది. ఎమోషన్స్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది. లొకేషన్లు, ఆర్ట్ డైరక్షన్‌కి కచ్చితంగా మంచి మార్కులు వేయాల్సిందే. సన్నివేశాల్లో మూడ్‌ని ఎలివేట్ చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. కెమెరా వర్క్ కూడా బావుంది.
మైనస్ పాయింట్లు:
సినిమాలో మైనస్ పాయింట్ల గురించి ప్రస్తావించాలంటే ముందుగా చెప్పాల్సింది నిడివి గురించి. మరో పది నిమిషాలు నిడివి తగ్గించి ఉంటే బావుండేది. రావు రమేష్ పాత్రను ఏదో కథలో భాగం చేశారే తప్ప, అంతకు మించిన ఇంపార్టెన్స్ లేదనిపిస్తుంది. ఫస్టాఫ్ మరీ సాగదీతతగా ఉన్నట్టు అనిపిస్తుంది. సెకండాఫ్ కూడా ఎమోషనల్‌గా ఒకట్రెండు చోట్ల కంటతడి పెట్టించిన మాట వాస్తవమే కానీ, క్రికెట్ గ్రౌండ్లో కి నాని దిగిన తర్వాత ఏం జరుగుతుందో ముందే ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. కొన్ని చోట్ల ఇంకాస్త క్రిస్పీగా కథ చెప్పి ఉంటే బావుండేది.
విశ్లేషణ:
జెర్సీ అంటే గ్రౌండ్‌లో ఆటగాడు వేసుకునే టీ షర్ట్. అది కావాలని కోరిక కొడుకు కోరికను తీర్చడానికి తండ్రి చేసిన ప్రయత్నం. రూ.500 విలువున్న జెర్సీ కొనివ్వలేని తండ్రి ప రిస్థితులకు కారణం, వాటి నుంచి బయటకు రావడానికి అతను చేసిన ప్రయత్నం, కుటుంబంలో వాతావరణం, నచ్చిన పని చేస్తున్నప్పుడు వ్యక్తిలో ఉండే హుషారు, పెళ్లయ్యాక కుదురులేని జీవితం పట్ల ఇల్లాలు వ్యక్తం చేసే భయాలు... ఇలాంటివి ఎన్నెన్నో మధ్య తరగతి జీవితాల్లో నిత్యం మనం చూసే సమస్యలు, వాటి పరిష్కారాలు, భావోద్వేగాల సమాహారమే జెర్సీ. `ప్రపంచంలో అందరూ నన్ను జడ్జి చేసిన వాళ్లే... నా కొడుకు తప్ప`, `నా కొడుకు దృష్టిలో నేను ఇంచి తగ్గినా భరించలేను`, `మా నాన్నకన్న కల కోసం ప్రయత్నిస్తూ చనిపోలేదు. చనిపోతానని తెలిసినా ప్రయత్నం చేశాడు `వంటి డైలాగులు బావుంటాయి. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకున్న తీరును చూపించే సన్నివేశాలు కంటతడిపెట్టిస్తాయి. మధ్యతరగతి కుటుంబాలకు బాగా కనెక్ట్ అయ్యే సినిమా జెర్సీ. నటీనటుల నటన, గౌతమ్ రాసుకున్న ఎమోషన్స్, పాటలు, కెమెరా... ఇలా అన్ని విభాగాలు కలిసి చేసిన టీమ్ వర్క్ కి ప్రతిఫలం ఈ చిత్రం.
బాటమ్ లైన్: వెండితెరమీద వేసవి 'జెర్సీ'
Comments