వేణుమాదవ్‌ను పరామర్శించిన జీవిత, ఉత్తేజ్
- IndiaGlitz, [Tuesday,September 24 2019]
ప్రముఖ హాస్యనటుడు వేణుమాదవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో వైద్యులు వైణుకు కృతిమ శ్వాస అందిస్తున్నారు. ఈ నెల 6న కాలేయ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన వేణుమాదవ్‌కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో వేణుమాదవ్ ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జీవిత రాజశేఖర్, నటుడు ఉత్తేజ్ హుటాహుటినా ఆస్పత్రికి చేరుకొని వేణుమాదవ్ ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వేణుమాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సూర్యపేట జిల్లా కోదాడలో జన్మించిన వేణుమాదవ్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, హాస్యనటుడిగా, కథానాయకుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన వేణుమాదవ్... తొలిప్రేమ, దిల్, లక్ష్మి, సై, ఛత్రపతి చిత్రాలు మంచిపేరు తీసుకొచ్చాయి. 2006లో లక్ష్మి సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా వేణుమాదవ్ నంది పురస్కారాన్ని అందుకున్నారు.