కుమార్తె ఖాతాలోకి ‘మా’ డబ్బు.. అసలు విషయం చెప్పిన జీవిత!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో మినీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నరేశ్ ప్యానెల్ నెగ్గి అధ్యక్ష పీఠం కైవసం చేసుకుంది. అయితే ఎన్నికలు మొదలుకుని నేటి వరకూ ఈ ‘మా’ గురించి వచ్చిన వార్తలు కోకొల్లలు. తాజాగా.. ‘మా’ సభ్యుల కోసం ఖర్చు చేయాల్సిన ఏడున్నర లక్షల నగదు మొత్తాన్ని జీవిత రాజశేఖర్ కుమార్తె ఖాతాలోకి వెళ్లిపోయాయని వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. దీంతో ‘మా’లో అసలేం జరుగుతోంది..? ఎందుకిలా అస్తమాను ‘మా’ వార్తల్లో నిలుస్తోంది అంటూ ప్రముఖులు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అసలు ఈ డబ్బు వ్యవహారమేంటి..? ఎందుకిలా జరిగిందనే విషయంపై కాస్త లోతుగా వెళ్లి ఆరా తీయగా కొన్ని సంచలనాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ‘మా’ ట్రెజరర్‌గా రెండో సారి ఎన్నికల్లో ఓడిన శివాజీ రాజా ప్యానెల్‌గా చెందిన రాజీవ్ కనకాల కొనసాగుతున్న విషయం తెలిసిందే.
అసలేం జరిగింది...!!
‘మా’ సంఘ భవనం కోసం తెలంగాణా ప్రభుత్వాన్ని స్థలం అడగాలని సభ్యులు నిర్ణయించారు. ఇందుకుగాను ముందుగా ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలనే ఐడియాతో తెలంగాణా ప్రభుత్వ పథకాలను పొగుడుతూ కొన్ని ప్రకటనలు చేయించి కానుకగా ఇద్దామని ‘మా’ సభ్యులు భావించారు. ఇందుకు గాను ఏడున్నర లక్షలు ఖర్చు చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని మొదట జీవిత రాజశేఖర్ కుమార్తె భరించి.. ప్రకటనలు చేయించినట్లు పెద్ద ఎత్తున రూమర్స్ వస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రకటనలు చూసిన వెంటనే... వైరి వర్గం వారు మీడియాకు లీకులిచ్చి మా పై వ్యతిరేక ప్రచారం చేసేందుకు యత్నించారట. ఈ ప్రకటనలకు గాను ‘మా’ నిధుల నుంచి ఆమె అకౌంట్‌కి డబ్బు పంపారట. సభ్యుల సంక్షేమం కోసం వాడాల్సిన డబ్బుని ఇలా వేరే పనులకు వాడడంపై సర్వత్రా వ్యతిరేకత, విమర్శలు వస్తున్నాయి. దీంతో ‘మా’లో మరోసారి రచ్చ జరిగింది. దీంతో వివాదం పెద్దది కాకమునుపే జీవితా రాజశేఖర్ రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకున్నారు.
జీవిత ఏమంటున్నారు..!?
"‘మా’ అసోసియేషన్‌లో మేమంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నాము. ‘మా’ సంఘ డబ్బులతో ప్రభుత్వ పథకాలతో ప్రకటనలు చేయించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఇలా మీడియా ముందుకు వచ్చాను. మేము నిబంధనలు ఉల్లంఘించి చేయలేదు.. అంతా రూల్స్ ప్రకారమే చేసాము. ఈ ప్రకటనల విషయం కార్యవర్గంలో అందరికీ తెలుసు. ఇందులో ఎవరికైనా సందేహాలు వుంటే ఆఫీసుకు వస్తే రూల్ ఫొజిషన్ చూపించి, వివరణ ఇస్తాను" అని సంఘ కార్యదర్శి, నటి జీవిత స్పష్టం చేశారు.
అందుకే ప్రకటనలు చేయించాం!
"మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కొన్ని రోజుల క్రితం మా ఆఫీస్‌కు వచ్చారు. పేద ఆర్టిస్టుల కోసం మేం చేయదలుచుకున్న పనుల గురించి ఆయనకు నిశితంగా వివరించాము. ‘మా’తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి సహాయం అందిస్తుందని తలసాని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించే ‘కళ్యాణ లక్ష్మి’ డబుల్ ‘బెడ్రూమ్ ఇళ్లు’ తదితర పథకాలు పేదవారు, అర్హులైన సభ్యులు వుంటే మా సంఘంలో వారికి కూడా అదేలా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అందుకే మా వంతుగా ఆ మంచి పథకాలకు ప్రచారం చేయాలని నిర్ణయించాము. చాలా తక్కువ ఖర్చుతో ఏడున్నర లక్షలతో ప్రకటనలు రూపొందిచాంమ. అలాంటి టైమ్‌లో అధ్యక్షుడు నరేష్ వేరేచోట వుండడంతో, ప్రకటనలు చేసిన వారికి నేను క్యాష్ అడ్జస్ట్ చేశాను అంతే.. అందువల్ల మళ్లీ ఆ మొత్తాన్ని ‘మా’ నుంచి తీసుకున్నాము. ఇంత తక్కువ మొత్తానికి ఎవ్వరూ ప్రకటనలు చేయించలేరు. ప్రకటనలు చేయించడం అస్సలు ఎంతమాత్రం నిబంధనలు అతిక్రమించడం కాదు. సభ్యుల కోసం ప్రభుత్వం నుంచి సహాయం పొందాలనుకున్నపుడు, మావంతు కృతజ్ఞతతో చేసాం తప్ప వేరేది కాదు" అని జీవిత వివరించారు. మొత్తానికి చూస్తే.. ‘మా’ నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ రేగిన వివాదానికి జీవిత రాజశేఖర్ ఆదిలోనే అడ్డుకట్ట వేశారని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments