Jeevitha Rajasekhar : జహీరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధిగా జీవితా రాజశేఖర్.. జోరుగా ఊహాగానాలు..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్‌ను అన్ని రకాలుగా ఇరుకునపెట్టే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి వివిధ పార్టీల్లోని కీలక నేతలను ఆకర్షించి బలోపేతం కావాలని భావిస్తోంది. అలాగే సినీ ప్రముఖులను కూడా పార్టీలోకి ఆహ్వానించాలని కార్యాచరణ మొదలుపెట్టింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, నితిన్, ప్రభాస్ వంటి వారితో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు. వీరిని పార్టీలోకి చేర్చుకోవడమో లేదంటే తమకు మద్ధతు పలికేలా ఒప్పించాలని యత్నిస్తోంది. ఇప్పటికే జీవితా రాజశేఖర్ బీజేపీలో దాదాపు చేరినట్లే కనిపిస్తోంది. ఇటీవల సీనియర్ హీరోయిన్ దివ్యవాణి.. ఈటల రాజేందర్‌తో భేటీ అయ్యారు. రేపో మాపో ఆమె కాషాయ తీర్థం పుచ్చుకోవడం పక్కా.
టికెట్ ఇస్తేనే యాక్టీవ్‌గా వుంటానన్న జీవిత:
వీరందరిలోకి చెప్పికోవాల్సింది జీవితా రాజశేఖర్ గురించి. హీరోయిన్‌గా, దర్శకురాలిగా, నిర్మాతగా, మా అసోసియేషన్‌లో యాక్టీవ్ మెంబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవితకు రాజకీయాలంటే ఎంతో ఆసక్తి. కానీ అనివార్య కారణాల వల్ల అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. చివరి నిమిషంలో టికెట్ లభించని సందర్భాలున్నాయి. కానీ ఈసారి మాత్రం తాడోపేడో తేల్చుకోవాలని జీవిత డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. గతంలో తమకు సరైన ప్రాధాన్యత దక్కలేదని.. ఈసారి టికెట్ గ్యారెంటీ అన్న హామీ ఇస్తే యాక్టీవ్ అవుతానని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి తేల్చిచెప్పినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంచి వాగ్థాటి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టగల సత్తా :
ఏపీ, తెలంగాణలలో ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని జీవిత చెప్పడంతో బీజేపీ పెద్దలు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమెకు మంచి వాగ్థాటి వుంది. పదునైన విమర్శలు చేసి ప్రత్యర్ధులను డిఫెన్స్‌లో పడేయగల సత్తా వుంది. ఇదే సమయంలో తెలంగాణ బీజేపీలో మహిళా నేతల కొరత వుంది. దీంతో ఆమెకు టికెట్ ఖరారైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా ఏకంగా పార్లమెంట్ ఎన్నికలకేనట. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి జీవితను బరిలోకి దింపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. దీని వెనుక కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది.
జహీరాబాద్ బరిలో మహిళే కావాలంటోన్న నిర్మలా సీతారామన్:
జహీరాబాద్‌కు ప్రస్తుతం నిర్మల ఇన్‌ఛార్జీగా వున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో పర్యటించారు కూడా. ఈ క్రమంలోనే జహీరాబాద్ నుంచి మహిళను బరిలోకి దింపితే బాగుంటుందని.. ఆమె అధిష్టానానికి సూచించారట. ప్రస్తుత తెలంగాణ బీజేపీ నేతల్లో వున్న మహిళల్లో విజయశాంతి, డికే అరుణల చూపు అసెంబ్లీ పైనే వున్నట్లుగా తెలుస్తోంది. వాళ్లు ఢిల్లీలో అడుగుపెట్టేందుకు అంతగా ఇష్టపడటం లేదు. దీంతో జహీరాబాద్ ఛాన్స్ జీవితను వరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout