వైసీపీలోకి రాజశేఖర్ దంపతులు.. జగన్ పులి బిడ్డ!
- IndiaGlitz, [Monday,April 01 2019]
వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువవుతున్నాయి. అటు రాజకీయ నేతలు... ఇటు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, పెద్దలు పార్టీ తీర్థం పుచ్చుకోగా తాజాగా.. యాంగ్రీస్టార్ రాజశేఖర్, జీవితా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు చర్చించిన అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ కండువా కప్పిన జగన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మాములు బిడ్డ కాదు పులిబిడ్డ..
కండువా కప్పుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన రాజశేఖర్ దంపతులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలు బిడ్డ కాదని, పులిబిడ్డని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. చాలా రోజుల తర్వాత జగన్‌ను కలిశానని.. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు సూపర్ సీఎం అనుకుంటే.. ఆయన్ను దించేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సూపర్, డూపర్ సీఎం అనిపించుకున్నారు. అంతకుమించి జగన్ చేయగలడన్న నమ్మకం నాకుంది. ఆరోగ్య శ్రీ పథకంతో పాటు రైతులకు వైఎస్ ఎంతో మేలు చేశారు. ప్రజల మనసుల్లో ఉండిపోయారు. గతంలో కొన్ని పార్టీలతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయి. వాటన్నింటినీ తొలగించుకుంటూ వచ్చాను అని రాజశేఖర్ మీడియాకు వివరించారు.
అప్పటి జగన్ ఇప్పటి జగన్ వేరు!
అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను. నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చాను. అప్పటి జగన్ వేరు.. ఇప్పటి జగన్ వేరు. ఇప్పటికే ఆయనను కలవడం ఆలస్యం అయింది. యువకుడైన జగన్‌కు ఏపీ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు.
భవిష్యత్ బాగుపడాలంటే జగన్‌తోనే సాధ్యం..
ఎన్నికల ముందు ఇచ్చే డబ్బులు, చీరలకు ఓటర్లు ఆశపడద్దు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలంటే అది జగన్‌తోనే సాధ్యం. కష్టపడకుండా కొడుకును సీఎంను చేయాలనుకునేవారు మనకొద్దు. వైఎస్ జగన్ లాంటి కష్టపడేవాళ్లు మనకు కావాలి. జగన్‌ను సీఎం చేసేందుకు మా వంతు మేం కష్టపడుతాంఅని జీవిత అన్నారు.
ఒక్కసారి గతంలోకి వెళితే..
ఇదిలా ఉంటే.. గతంలో జీవిత, రాజశేఖర్‌లు టీడీపీ సానుభూతిపరులుగానే వుండేవారన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్‌లో చేరి.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలోనూ చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ దంపతులు త్వరలో ఎన్నికలు జరగనుండగా ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు వైసీపీలో చేరారు. అయితే ఈ పార్టీలో అయినా సక్రమంగా ఉంటారో లేకుంటే మళ్లీ కండువాలు మార్చేస్తారో వేచి చూడాల్సిందే మరి.